మహిళ కడుపులో మద్యం తయారు.. అరుదైన వ్యాధిగా నిర్ధారించిన వైద్యులు!

-

మనిషి కపుడులో మద్యం తయారవడం గురించి మీరెప్పుడైనా విన్నారా? అరే.. మనిషి కడుపులో మద్యం తయారడం ఏంటి అనుకుంటున్నారా? అయ్యో రామా.. నిజమండీ! పెన్సిల్వేనియాకు చెందిన ఓ మహిళ కడపులో మద్యం తయారవుతుందట. ఆమె మూత్ర విసర్జనకు వెళ్తే టాయిలెట్‌ మొత్తం మద్యం వాసన గుప్పుమంటుందట. మరి ఈ వింత సంగతి గురించి మరింత వివరంగా తెలుసుకుందామా..!

పెన్సిల్వేనియాకు చెందిన 61 ఏండ్ల మహిళ తన మూత్రం మద్యం వాసన వస్తున్నదంటూ ఇటీవల వైద్యులను సంప్రదించింది. దీంతో డాక్టర్లు అమెకు కావాల్సిన వైద్య పరీక్షలు చేశారు. అమె నుంచి అవసరమైన వివరాలన్నీ అడిగి తెలుసుకున్నారు. ఆ వివరాల ఆధారంగా.. గతంలోనే వైద్యులు ఆమెకు కాలేయ మార్పిడి చేయాలని సూచించారని, ప్రస్తుతం కాలేయ దాత కోసం ఆమె ఎదురుచూస్తున్నదని తెలుసుకున్నారు.

దీంతో బాధితురాలి కాలేయం పాడవడానికి మద్యం అలవాటే కారణమని వైద్యులు అనుమానించారు. తనకు మద్యం అలవాటు లేదని ఆమె చెప్పినా వాళ్లు నమ్మకుండా సంబంధిత వైద్య పరీక్షలన్నీ చేయించారు. అయితే, ఆమె రక్తంలో ఎక్కడా మద్యం ఆనవాళ్లే లేవని పరీక్షల్లో తేలడంతో ఆశ్చర్యపోయారు. మరి మూత్రం మద్యంలా వాసన రావడానికి కారణం ఏంటో తెలుసుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు.

పిట్స్‌బర్గ్‌ యూనివర్సిటీలోని మెడికల్‌ సెంటర్లో బాధితురాలి వింత సమస్యపై పరిశోధనలు చేశారు. ఈస్ట్ జాతికి చెందిన ఓ రకం శిలీంధ్రం ఆమె కడుపులో అధిక స్థాయిలో ఉన్నట్లు గుర్తించారు. సాధారణంగా ప్రతి ఒక్కరిలోనూ ఉత్పత్తి అవుతూ ఎప్పటికప్పుడు బయటకు విసర్జించబడే ఈ శిలీంధ్రాలు.. షుగర్‌ పేషెంట్‌ కావడంతో ఆమె పేగుల్లో పెద్దఎత్తున తిష్టవేశాయని తెలిసి ఆశ్చర్యపోయారు.

సాధారణంగా చక్కెరలు, ఈస్ట్‌లు ఆల్కహాల్‌ తయారీకి ఉపయోగించే కీలక పదార్థాలు. అదేవిధంగా, బాధితురాలి కడుపులో తిష్టవేసిన ఈస్ట్‌లు కూడా మధుమేహ రోగి అయిన అమె రక్తంలోని చక్కెరలతో కలిసి మూత్రాన్ని మద్యంలా మారుస్తున్నట్లు పరిశోధకులు తేల్చారు. ఈ అరుదైన సమస్యను ‘యూరినరీ ఆటో బ్రేవరీ సిండ్రోమ్‌’ అంటారని వైద్యులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news