కరోనా టెస్టులను చేసేందుకు ఇప్పటి వరకు పలు భిన్న రకాల పద్ధతులను అనుసరిస్తున్నారు. అయితే అమెరికాలోని ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) కరోనా టెస్టుకు గాను ఓ నూతన పద్ధతికి ఓకే చెప్పింది. ఇకపై అనుమానితులకు చెందిన ఉమ్మి శాంపిల్స్‌ను సేకరించి కరోనా టెస్టు చేయనున్నారు. ఈ మేరకు అమెరికా ఎఫ్‌డీఏ తాజాగా అనుమతులు జారీ చేసింది.
యేల్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ సంస్థకు ఎఫ్‌డీఏ ఉమ్మి శాంపిళ్ల ద్వారా కరోనా టెస్టులు చేసేందుకు అనుమతులు జారీ చేసింది. ఎమర్జెన్సీ సమయాల్లో ఈ విధానంలో కరోనా టెస్టులు చేయవచ్చని ఎఫ్‌డీఏ తెలిపింది. అయితే దీన్ని సాధారణ సమయాల్లోనూ కరోనా టెస్టులకు ఉపయోగించవచ్చా, లేదా.. అసలు ఉమ్మి ద్వారా కరోనా టెస్టు ఎలా చేస్తారు ? అందుకు ఏయే పరికరాలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి ? అనే వివరాలను మాత్రం ఎఫ్‌డీఏ ఇంకా వెల్లడించలేదు.
ప్రస్తుతం కరోనా టెస్టులకు ర్యాపిడ్ యాంటీ జెన్, ఆర్‌టీ పీసీఆర్ వంటి టెస్టులను ఉపయోగిస్తున్నారు. ఆయా విధానాల్లో ముక్కు లోపల స్వాబ్స్‌తో శాంపిల్స్ సేకరిస్తారు. దీని వల్ల కొంత ఇబ్బంది కలుగుతుంది. స్వాబ్స్‌ను ముక్కు లోపలి దాకా పంపిస్తారు. దీంతో కొంత మేర అసౌకర్యం కలుగుతుంది. అయితే ఉమ్మిని టెస్టు చేయడం వల్ల ఆ ఇబ్బంది తగ్గుతుంది. మరి ఈ నూతన పరీక్షా విధానాన్ని ఇతర దేశాల్లో ఎప్పటి నుంచి అమలు చేస్తారో చూడాలి.