5 నిమిషాల్లోనే కరోనా నిర్ధారణ పరీక్ష!

-

కరోనా వైరస్ పేరు వింటనే ప్రతి ఒక్కరు భయపడిపోతున్నారు. ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఈ వైరస్ నిర్ధారణ పరీక్షల కోసం ఎక్కువ సమయం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. మరోవైపు కరోనా వేగంగా విస్తరిస్తూ ప్రపంచ దేశాలకు, శాస్త్రవేత్తలకు సవాలు విసురుతోంది. అయితే అలాంటి కరోనా నిర్ధారణ పరీక్షలు కేవలం నిమిషాల వ్యవధిలోనే తెలుసుకునేలా అమెరికాకు చెందిన హెల్త్‌ కేర్ సంస్థ అబాట్ లాబొరేటరీస్ సరికొత్త కిట్‌ను తయారుచేసింది. మాలిక్యులర్ టెక్నాలజీతో రూపొందించిన ఈ పరికరం చిన్న టోస్టర్ పరిమాణంలో ఉంటుంది. కేవలం 5 నిమిషాల్లోనే కరోనా సోకిందా లేదా అనే విషయాన్ని వెల్లడిస్తుంది. అయితే కరోనా నెగిటివ్ ఫలితానికి మాత్రం ఈ కిట్ 13 నిమిషాల సమయం తీసుకుంటుందని అబాట్ సంస్థ తెలిపింది. యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఈ కిట్‌లను వచ్చేవారంలోగా పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావడానికి తమకు అనుమతిచ్చిందని ఆ సంస్థ వెల్లడించింది.

కరోనాపై పోరాటం ఈ కిట్ ఎంతగానో ఉపకరిస్తుందని అబాట్ సంస్థ అధ్యక్షుడు, సీఓఓ రాబర్ట్ ఫోర్డ్ అన్నారు. కేవలం నిమిషాల వ్యవధిలోనే వైరస్ నిర్దారణ ఫలితాలు వెలువడం వల్ల కరోనా ఎక్కువ మందికి విస్తరించకుండా అడ్డుకట్ట వేయవచ్చని తెలిపారు. హాస్పిటల్స్‌లో మాత్రమే కాకుండా ఎక్కడికైనా తరలించేందుకు వీలుగా దీనిని రూపొందించామని చెప్పారు.

కాగా, ప్రపంచవ్యాప్తంగా దాదాపు 5.9 లక్షల మందికి కరోనా సోకగా, 27 వేలకుపైగా మృతిచెందారు. ఇండియాలో 873 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా, 19 మంది చనిపోయినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Latest news