అమెరికా అధ్యక్షుడిగా రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ భారీ మెజార్టీతో ఎంపికైన విషయం తెలిసిందే. ఇప్పటికీ కొన్ని రాష్ట్రాలకు సంబధించిన పూర్తి ఫలితాలు తేలలేదు. అధ్యక్షుడి ఎన్నికకు అవసరమైన మెజార్టీ మార్క్ 270 కాగా.. ట్రంప్ ఇప్పటికే 292 ఎలక్టోరోల్ ఓట్లను సాధించి అధ్యక్షుడిగా రెండోసారి ప్రమాణం చేసేందుకు అన్ని అర్హతలు సాధించారు.
ఇదిలాఉండగా, ట్రంప్ అధ్యక్షుడిగా ప్రమాణం చేయడానికి 2 నెల గ్యాప్ ఉంటుంది. జనవరి 20న ఆయన కొత్త అధ్యక్షుడిగా ప్రమాణం చేస్తారు. 20వ రాజ్యంగ సవరణ ద్వారా మార్చి 4గా ఉన్న తేదీని జనవరి 20కి మార్చారు. అమెరికా అధ్యక్షుడి పదవీకాలం 4 ఏళ్లు ఉంటుంది. అయితే, ఎన్నికలకు, ప్రమాణానికి మధ్యలో రెండు నెలల గ్యాప్ ఎందుకు ఉంటుందంటే.. ఈ గ్యాప్‌లో ప్రభుత్వ మార్పిడికి సంబంధించిన కార్యక్రమాలు జరుగుతాయి. మంత్రులు, కీలక స్థానాల్లో ఉండే వారిని ఖరారుచేసుకుంటారు. డిసెంబర్ 17న ఎలక్టోరల్ కాలేజీ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకుంటుంది. జనవరి 6న ప్రతినిధుల సభ, సెనెట్ ట్రంప్ ఎన్నికను ఆమోదిస్తుంది.