భారత క్రికెట్ జట్టు ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీకి అమెరికా ఎంబస్సీ వీసా నిరాకరించింది. షమీపై అతని భార్య హసీన్ జహాన్ గతంలో వేధింపులు, గృహ హింస, ఇతర అమ్మాయిలతో సంబంధాలు ఉన్నాయని చెప్పి కేసు పెట్టిన విషయం విదితమే.
భారత క్రికెట్ జట్టు ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీకి అమెరికా ఎంబస్సీ వీసా నిరాకరించింది. షమీపై అతని భార్య హసీన్ జహాన్ గతంలో వేధింపులు, గృహ హింస, ఇతర అమ్మాయిలతో సంబంధాలు ఉన్నాయని చెప్పి కేసు పెట్టిన విషయం విదితమే. అయితే ఈ విషయంలో పోలీస్ వెరిఫికేషన్ ఇంకా పూర్తి కాలేదు. దీంతో ఆ కారణం చెప్పి అమెరికా షమీకి వీసా నిరాకరించింది. అయితే ఈ విషయం తెలుసుకున్న బీసీసీఐ రంగంలోకి దిగింది.
షమీకి అమెరికా వీసా నిరాకరించిందన్న సంగతి తెలుసుకున్న బీసీసీఐ సీఈవో రాహుల్ జోహ్రి అమెరికా ఎంబస్సీకి ఓ లేఖ రాశారు. షమీ ప్రముఖ భారత క్రికెట్ ఆటగాడని, అతను దేశం తరఫున ఎన్నో ముఖ్యమైన మ్యాచ్‌లు ఆడాడని ఆ లెటర్‌లో రాహుల్ పేర్కొన్నారు. అలాగే అతని ప్రదర్శనకు చెందిన పలు ప్రూఫ్‌లతో కూడిన వివరాలను కూడా ఆ లెటర్‌తో ఇచ్చారు. దీంతో అమెరికా ఎంబస్సీ ఎట్టకేలకు షమీకి వీసా ఇచ్చింది. అతనికి పీ1 కేటగిరీ కింద వీసా ఇచ్చినట్లు అమెరికా ఎంబస్సీ తెలిపింది.
సాధారణంగా ఏదైనా ఒక దేశానికి చెందిన అంతర్జాతీయ జట్టులో ఆడే ఆటగాళ్లకు పీ1 వీసాను ఇస్తారు. అదే వీసాను అమెరికా షమీకి ఇచ్చింది. కాగా షమీ, అతని భార్య హసీన్ జహాన్‌ల మధ్య ఉన్న కేసు ప్రస్తుతం కోర్టులో నడుస్తోంది. వీరిద్దరూ విడాకులకు అప్లై చేసుకోగా అది ప్రస్తుతం పెండింగ్‌లో ఉంది.