దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు 150కి చేరుకోగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఈ వైరస్ పట్ల మరిన్ని కట్టుదిట్టమైన చర్యలను తీసుకుంటున్నాయి. పలు దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై ఇప్పటికే భారత ప్రభుత్వం నిషేధం విధించగా, అన్ని రాష్ట్రాలలోనూ కరోనా అనుమానితులను పరిశీలించేందుకు ఐసొలేషన్ సెంటర్లు, క్వారంటైన్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. కాగా ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం కరోనా నేపథ్యంలో సంచలన నిర్ణయం తీసుకుంది.
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కరోనా వైరస్ నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఆ రాష్ట్రంలో 1 నుంచి 8వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు వార్షిక పరీక్షలు నిర్వహించబోమని స్పష్టం చేసింది. వారికి పరీక్షలు పెట్టకుండానే అందరినీ పాస్ చేస్తామని, ఈ క్రమంలో అందరినీ తరువాతి తరగతులకు ప్రమోట్ చేస్తామని తెలిపారు. ఆ రాష్ట్ర ప్రాథమిక విద్యాశాఖ ఈ మేరకు బుధవారం ప్రకటన విడుదల చేసింది.
ఇక ఇప్పటికే యూపీలో మార్చి 23 నుంచి 28వ తేదీ వరకు ఆయా తరగతుల విద్యార్థులకు వార్షిక పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. కానీ తాజాగా నిర్ణయంతో ఇకపై విద్యార్థులు పరీక్షలు రాయాల్సిన పనిలేదు. ఇక యూపీలోని అన్ని విద్యాసంస్థలకు ఇప్పటికే ఏప్రిల్ 2వ తేదీ వరకు సెలవులు ప్రకటించారు. కాగా యూపీలో ఇప్పటి వరకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 16కి పైగా చేరుకుంది. ఈ క్రమంలో అక్కడి ప్రాథమిక విద్యాశాఖ ఈ సంచలన నిర్ణయం తీసుకోవడం విశేషం.