ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ తన పంజా విసురుతోంది. చైనాలో ఇప్పటికే 3వేల మందికి పైగా కరోనా వైరస్ వల్ల చనిపోగా, అనేక వేల మందికి ఈ వ్యాధి సోకినట్లు నిర్దారించారు. ఇక తాజాగా భారత్‌లోని న్యూఢిల్లీతోపాటు, హైదరాబాద్‌లోనూ కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో కరోనా వైరస్‌ను అడ్డుకునేందుకు సైంటిస్టులు అన్ని రకాల ప్రయోగాలు చేస్తున్నారు. అయితే ఈ వైరస్‌కు వ్యాక్సిన్‌ను తయారు చేసేందుకు ఇంకా కొన్ని నెలల వరకు సమయం పడుతుందని సైంటిస్టులు చెబుతున్నారు.
కోవిడ్-19 ఔట్ బ్రేక్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎమర్జెన్సీ కమిటీ 15 మంది సభ్యుల్లో ఒకరైన ప్రొఫెసర్ వాంగ్ లిన్‌ఫా ఇటీవలే ఓ ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కరోనా వైరస్ వ్యాక్సిన్‌కు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్‌కు వ్యాక్సిన్‌ను తయారు చేసేందుకు మరో 6 నుంచి 9 నెలల సమయం పట్టవచ్చని తెలిపారు.
కాగా చైనా, ఇజ్రాయెల్‌కు చెందిన సైంటిస్టులు కరోనా వైరస్ వాక్సిన్లను తయారు చేశామని చెబుతున్నా.. అవి ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నాయని ప్రొఫెసర్ వాంగ్ అన్నారు. వ్యాక్సిన్‌ను తయారు చేయడంతోనే పని అయిపోదని, ముందుగా దాన్ని జంతువులు, మనుషుల కణాలపై ప్రయోగించాలని, ఆ ప్రయోగాలు రెండూ విజయవంతమైతేనే మనుషులపై ప్రయోగాలు చేస్తారని, ఆ తరువాత వ్యాక్సిన్‌ను మార్కెట్‌లోకి రిలీజ్ చేస్తారని తెలిపారు. అయితే కరోనా వ్యాక్సిన్‌కు పెద్ద ఎత్తున ఖర్చు అయ్యేందుకు కూడా అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు. ఇక వాక్సిన్ మార్కెట్‌లోకి వస్తే ముందుగా వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోని రోగులకు దాన్ని సరఫరా చేస్తారని ఆయన తెలిపారు. దీన్ని బట్టి చూస్తే కరోనా భూతం ఇప్పుడప్పుడే వదిలేట్టు కనిపించడం లేదని మనకు స్పష్టమవుతుంది..!