ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు స్థానాలకు రాజ్యసభ ఎన్నికలు జరుగుతుండగా శుక్రవారం ఉదయం నుంచి వైసీపీ, టీడీపీ ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కూడా వచ్చి తన ఓటుని వినియోగించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. చంద్రబాబు మీకు విప్ జారీ చేశారా? అని ఒక విలేఖరు అడగ్గా.. ‘నాకు విజ్ జారీ చేసేంత మగాడా?’ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘విప్ జారీ చేయడానికి చంద్రబాబు వద్ద ఏముంది ఉడకబెట్టిన నాగడి దుంప’ అని ఎద్దేవా చేశారు. పార్టీ నుంచి సస్పెండైన తనకు విప్ ఎలా జారీ చేస్తారని ప్రశ్నించారు.
పక్కనున్న కొంతమంది చెంచాల మాట విని చంద్రబాబు టీడీపీని నాశనం చేశాడని, ఇకనైనా చంద్రబాబు వారిని దూరం పెట్టకపోతే ఇంకా తీవ్రంగా నష్టపోతారని ఆయన తెలిపారు. అనుకూల మీడియాతో ఇంకా డబ్బా కొట్టించుకోవడం చంద్రబాబు మానలేదని ఆయన ఎద్దేవా చేశారు. చంద్రబాబు స్వార్ధపరుడు కాబట్టే.. రాజ్యసభ సీటు గెలిచే అవకాశం ఉన్న సమయంలో వ్యాపారవేత్తలకు అవకాశం ఇచ్చి… సంఖ్యాబలం లేని సమయంలో దళితుడిని రంగంలోకి దించారని విమర్శించారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి జగన్ ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకొచ్చారని, ఆయన పాలనలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఆయన తెలిపారు.