గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రాజకీయాల నుంచి తప్పుకునే అవకాశం ఉందా…? అంటే అవుననే సమాధానం వస్తుంది. ప్రస్తుతం గన్నవరం నియోజకవర్గ రాజకీయాలపై గన్నవరం ఎమ్మెల్యే వంశీ నిర్వేదం చెందుతున్నారు. వైకాపా లో అందరిని కలుపుకుని వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నా దుట్టా, యార్లగడ్డ రెచ్చగొట్టేలా వ్యవహారాలు నడపడం, తరచూ గ్రామాల్లో గొడవలు సృష్టించి తనపై బురద చల్లే కార్యక్రమాలు చేయడం,
అధిష్ఠానం చూసి చూడనట్లు వదిలేయడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి ప్రభంజనం లోనూ సంచలన విజయం సాధించిన వంశీకి వైకాపా లో ఆదరణ పెరుగుతున్న నేపధ్యంలో సహించలేక దుట్టా, యార్లగడ్డలు పొమ్మనలేక పొగపెట్టిన రీతిలో వంశీ వలనే గొడవలు జరుగుతున్నట్లుగా చిత్రీకరణ చేయడం, ఏకంగా ఎమ్మెల్యే పై కేసులు పెట్టాలని పోలీసు అధికారులపై ఒత్తిడి చేయడం పట్ల వంశీ వర్గీయుల ఆగ్రహంగా ఉన్నారట.
ప్రజలకు మంచి చేయాలని, నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేయాలని వైకాపా ప్రభుత్వానికి మద్దతు తెలిపి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వం లో పనిచేస్తుంటే లేనిపోని నిందలు మోపడం పై వంశీ అభిమానుల కినుక వహిస్తున్నారు. రాజకీయాల నుంచి తప్పుకునే యోచనలో వంశీ ఉన్నారని వార్తలు వినపడుతున్నాయి. అందుకే సోమవారం బాపులపాడు మండలం లో వివిధ గ్రామాల్లో జరగాల్సిన పర్యటన అర్ధాంతరంగా రద్దు చేసుకున్నారు.
తన అనుచరులతో ఆయన వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. భవిష్యత్ కార్యాచరణ పై ముఖ్య నేతలతో చర్చలు జరుపుతున్నారు. సొంత డబ్బుతో 15 సంవత్సరాల నుంచి ప్రజలకు సేవ చేస్తూ ఎందుకు కొరగాని నాయకులతో మాటలు పడుతూ రాజకీయాల్లో కొనసాగడం అనవసరమా అంటు ముఖ్య అనుచరుల ఆందోళన వ్యక్తం చేసారట వంశీ. త్వరలోనే సిఎం వైఎస్ జగన్ ని కలిసి ఆయన రాజకీయాల నుంచి తప్పుకునే ప్రతిపాదన ఆయన ముందు పెట్టే అవకాశం ఉంది అని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చలు జరుగుతున్నాయి.