ప్రముఖులకు ఏపీలో కీలక బాధ్యతలు..

-

ఆంధ్రప్రదేశ్ ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న నాలుగు కార్పొరేషన్లకు ప్రముఖులను చైర్మన్లుగా  నియమిస్తూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ప్రొఫెసర్ కొలకలూరి ఇనాక్‌‌కు సాహిత్య అకాడమీ ఛైర్మన్‌, గాయకుడు, సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్‌ను సంగీత, నృత్య అకాడమీ ఛైర్మన్‌గా నియమించారు. జానపద కళలు, సృజనాత్మకత (ఫోక్ అండ్ క్రియేటివ్) అకాడమీ ఛైర్మన్‌గా పొట్లూరి హరికృష్ణ, ఏపీ స్టేట్ క్రిస్టియన్ (మైనారిటీస్) ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా మద్దిరాల జోసెఫ్ ఇమాన్యుయేల్‌ను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

అయితే తెలంగాణలోని ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన వందేమాతరం శ్రీనివాస్‌కు ఏపీ సీఎం కీలక పదవి ఇవ్వడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తెదేపా పార్టీ కోసం వందేమాతరం శ్రీనివాస్  పాడిన ‘తరలుదాం రండి మనం జన్మభూమికి..’ అంటూ సాగే పాట విశేష ఆదరణ పొందిన విషయం తెలిసిందే.  ఆచార్య కొలకలూరి ఇనాక్‌ రాసిన ‘విమర్శిని’కి 2018కి గాను ప్రతిష్టాత్మక కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు దక్కింది. దీంతో సాహిత్య అకాడమీ ఛైర్మన్‌ పదవి కట్టబెట్టి ప్రభుత్వం సముచిత స్థానం కల్పించింది.

Read more RELATED
Recommended to you

Latest news