దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్‌రెడ్డితో పాటు ఆయన కుమారుడు, ప్రస్తుత ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డిని ఆ నేత నమ్మలేదు.. వారిద్దరిని నమ్మి ఉంటే ఈ రోజు మంత్రిగా కీలక స్థానంలో కూర్చొని ఉండేవాడు. చివరకు అటు తిరిగి ఇటు తిరిగి చంద్రబాబు చెప్పిన మాటలు నమ్మి టీడీపీలో చేరి ఎటూ కాకుండా పోయాడు. ఇంతకు ఆ నేత ఎవరో కాదు వంగవీటి రాధా.
కాంగ్రెస్‌లో రాధా ప్రస్థానం ప్రారంభమైంది. 2009లో నాడు వైఎస్ ఇస్తానన్న మంత్రి పదవిని కాదనుకుని క్యాస్ట్ ఈక్వేషన్లలో తన కులానికి చెందిన చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టి..ఆ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయాడు. అక్కడితోనే అతడి కేరీర్ ఖతం అయ్యింది. అక్కడ నుంచి మళ్లీ జగన్ దగ్గరకు చేరిన రాధాకు జగన్ కూడా తాను అడిగిన ఎమ్మెల్యే సీటు ఇచ్చారు. మళ్లీ ఓడిపోయాడు.
వరుస ఓటములతో డీలా పడ్డ రాధా ఆ తర్వాత జనాలకు దూరంగా ఉండిపోయి.. జనాల్లో కలవడం మానేశాడు. అందుకే జగన్ ఈ ఎన్నికలకు ముందు సెంట్రల్ సీటు రాధాకు కాకుండా మల్లాది విష్ణుకు ఇచ్చారు. అయినా రాధాకు విజయవాడ తూర్పు లేదా మచిలీపట్నం ఎంపీ లేదా అవనిగడ్డ అసెంబ్లీ సీట్లలో ఏదో ఒకటి ఇస్తామని.. పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కాపు కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇస్తామని కూడా ఆఫర్ చేశారు.
అయినా రాధా వైసీపీని వీడి బయటకు వచ్చి జగన్‌పై తీవ్ర విమర్శలు చేసి మరీ టీడీపీలోకి వెళ్లారు. ఏ పార్టీపై అయితే రాధా తండ్రి రంగాను చంపించిందన్న ఆరోపణలు ఉన్నాయో రాధా అదే పార్టీలో చేరడం ఆ ఫ్యామిలీ వీరాభిమానులకే నచ్చలేదు. ఇక ఇప్పుడు ఆ కుటుంబానికి వైరి ఫ్యామిలీగా ఉన్న దేవినేని వారసుడు అవినాష్ వైసీపీలో చేరడంతో ఇప్పుడు రాధాకు అసలు టోటల్‌గా వైసీపీలోనే డోర్లు మూసుకుపోయినట్లయ్యింది.
ఇప్పుడు రాధా రాజకీయంగా ఎటూ కాకుండా పోయాడు. తిరిగి వైసీపీలోకి వెళదామన్నా జగన్ తీసుకునే పరిస్థితి లేదు. ఇక టీడీపీలో ఉండేందుకు కూడా ఇష్టపడడం లేదు. ఇక రాధా ఇటీవల జనసేన అధినేత పవన్ కల్యాణ్ ని కూడా కలిశారు. ఇక అయితే గియితే రాధా జనసేనలో అన్న చేరాలి లేదా బీజేపీలోకి అన్న వెళ్ళాలి. చూడాలి మరి రాధా ప్రయాణం ఎటు ఉంటుందో ? నాడు వైఎస్‌ను అయినా లేదా నేడు జగన్‌ను అయినా నమ్మి ఉంటే రాధా లైఫ్ ఈ రోజు ఓ రేంజ్‌లో ఉండేది… కాని బాబును నమ్మి చివరకు పోటీ చేయడానికి సీటు కూడా తెచ్చుకోలేకపోయాడు.