వర అంటే కోరుకున్నది అనీ. శ్రేష్ఠమైనది అనీ అర్థం. అంటే అందరూ కోరుకొనే సంపదలు వరాలు. వాటిని ఇచ్చేదీ, వాటి రూపంలో ఉన్నదీ వరలక్ష్మీ వ్రతం. వారి వారి ప్రజ్ఞాస్థాయీ భేదాల రీత్యా ఒక్కొక్కరికీ ఒక్కొక్కటి వరం. కోరినవేవి కావలన్నా భగవత్సంకల్పం లేనిదీ, ఆయన దయ రానిదీ పొందలేం. అసలు ఆనందం, సంపదలేని వస్తువును మనం కోరుకోం. అలా మనం కోరుకునే వాటిలో ఆనందరూపంగా ఉన్నదీ, ఆనందాలను ప్రసాదించేదీ వరలక్ష్మి. వరాలిచ్చే మాతను కొలువు దీర్చడం, ధూపదీప నైవేద్యాలతో అర్చించడం, భక్తి శ్రద్ధలతో పూజించడం అన్నీ ప్రాముఖ్యం కలిగినవే. అమ్మవారి వ్రత విధానంలో మనకు ఉపయోగపడే అంశాలు, జీవన శైలికి ఉపకరించే విలువైన పాఠాలూ ఎన్నో ఉన్నాయి.
కలశం: సృష్టికి సంకేతం. లోపల ఉన్న నీరు సమాజానికి ప్రతి రూపం. కలశానికి కట్టే సూత్రం అనుబంధానికి సూచిక. ఒక్క నీటి చుక్కలో కదలిక ఉంటే చాలు, దానంతటదే వ్యాపిస్తుంది. అలాగే పండుగ రోజున మంచి ఆలోచనలు, మనల్ని ముందుకు నడిపించే యోచనలు చేయాలి. అవి బహుముఖీన విస్తరించాలని అమ్మవారిని కోరుకోవడమే కలశ ప్రాధాన్యం. కలశం అడుగున ధాన్యం ఉంచుతాం. ధాన్యమంటే. జీవనాధారం. అంటే జీవిక కోసం మనం ఏ వృత్తి చేపట్టినా శ్రద్ధగా చేయాలనేదే దాని భావం.
కలశ వస్త్రం
వస్త్రం రంగు ప్రకృతికి నిదర్శనం. ఆ వస్త్రంలో అగ్ని, వరుణ, వనస్పతి, ఆదిత్య, పితృ దేవతలు, నక్షత్రాలు ఉంటారు. అగ్నిదేవుడు శుభ్రతను నేర్పుతాడు. సూర్యుడు తేజస్సు, వనస్పతి త్యాగం, పితదేవతలు అనుబంధం, నక్షత్రాలు స్థిరత్వానికి నిదర్శనం. వస్ర్తానికి చంద్రుడు అధిదేవత. చంద్రుడి నుంచి సౌఖ్యం, అమృతత్వం ప్రాప్తిస్తాయి. పైగా చంద్రుడు అమ్మవారికి తమ్ముడు. కాబట్టే మనకు చందమామ. ఒక కుటుంబ వ్యవస్థను సూచించే ఈ వ్రతం నుంచి.. మహిళలే కాదు.. పురుషులూ తెలుసుకోవాల్సిన విషయాలెన్నో ఉన్నాయి.