జగనన్న సురక్ష ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమమే లక్ష్యంగా ఇంటింటికి ప్రభుత్వం చేరువ,పథకాలు లేదా పత్రాలకు సంభంధించిన సమస్యల కోసం ప్రతి ఇంటికి సర్వే చేసి జగనన్న సురక్ష క్యాంప్ ల ద్వారా సర్టిఫికేట్లు జారీ చేస్తున్నామని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. పేద ప్రజలకు న్యాయం చేసేందుకు సీఎం జగన్ ఎంతవరకైనా వెళ్తారు . వైసీపీ ప్రభుత్వం పేదలకు అండగా ఉంటే చంద్రబాబు పెత్తందార్లకు అండగా ఉన్నారన్నారు. దేశంలో ఎక్కడా జరగని విధంగా ఆంధ్రప్రదేశ్ లో ప్రజలకు సురక్ష పథకం ద్వారా ఎంత మేలు జరుగుతుందని ఆయన తెలిపారు.
జగనన్న సురక్ష పేరుతో దేశంలోనే ఎవరూ చేయని విధంగా పేదలకు మేలు చేసినట్లు వెల్లంపల్లి వెల్లడించారు. పేదలందరికీ సురక్ష ద్వారా సర్టిఫికెట్స్ అందించి పథకాలు అమలు చేస్తున్నామని చెప్పుకొచ్చారు. భారతదేశ చరిత్రలో ఈ కార్యక్రమం చిరస్థాయిగా నిలిచిపోతుంది అని అన్నారు. 15వేల సచివాయలయాల్లో కోటిమందికి లబ్ధి చేకూరింది అని అన్నారు. 93.5లక్షల అభ్యర్థనలు పరిష్కరించినట్లు వెల్లడించారు. జూలై 17 ఒక్కరోజే 7.5లక్షల సర్టిఫికెట్స్ అందించి రికార్డు సృష్టించినట్లు తెలిపారు. విజయవాడ పశ్చిమలో 85వేల ఇళ్లకు చేరువై 90 క్యాంపుల ద్వారా 31వేల సర్టిఫికెట్లు అందించినట్లు వెల్లంపల్లి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. 40ఏళ్ల ఇండస్ట్రీ చంద్రబాబుకి ఏనాడూ ఇలాంటి ఆలోచన రాలేదు అని చెప్పుకొచ్చారు. చంద్రబాబు అయితే పత్రాలు లేవని పథకాలు ఆపేసేవారు అని గుర్తు చేశారు. పథకాల అమలుకు ప్రభుత్వ లోపం ఉండకూడదనే సురక్ష తీసుకొచ్చాం అని మాజీమంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ వివరించారు.