నల్గొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గం తెరాస అభ్యర్థికి ఓ గ్రామంలో పెట్టిన ఫ్లెక్సీ తనకు ఇబ్బందిగా మారింది…దీంతో ఆయన తన ప్రచారాన్ని సైతం వాయిదా వేసుకున్నారు. చిట్యాల మండలంలోని నేరడ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఫ్లెక్సీ ఏర్పాటు ఉద్రిక్తతకు దారితీయడంతో నకిరేకల్ తెరాస అభ్యర్థి వేముల వీరేశం తన ప్రచారాన్ని వాయిదా వేసుకునేంత పరిస్థితి ఏర్పడింది. తురాస పార్టీకి చెందిన దుబ్బాక నర్సింహారెడ్డి సోదరుడు దివంగత సతీశ్‌రెడ్డి దగ్గర గత ఎన్నికలకు ముందు వేముల వీరేశం రూ.30 లక్షలు తీసుకున్నట్టు ఆ ఫ్లేక్సీలో అర్థం వచ్చే విధంగా ఉంది. దీంతో ఆ సొమ్మును వీరేశం తిరిగి ఇవ్వలేదని, తమకు ఇవ్వాల్సిన మొత్తాన్ని చెల్లించాలంటూ సతీశ్ పేరుతో ఫ్లెక్సీని రూపొందించారు.
ఆ డబ్బు చెల్లించిన తర్వాతే ఊళ్లోకి అడుగుపెట్టాలన్నంతగా వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఇప్పటికే అనేక ఆరోపణలు ఉన్న వీరేశంపై సొంత పార్టీకి చెందిన నేతలే ఇలా ఫ్లెక్సీ ఏర్పాటు చేయడంతో పార్టీలో తీవ్ర చర్చనీయాంశమైంది. నేరడ గ్రామం మినహా .. మాజీ మంత్రి ఉమా మాధవరెడ్డితో కలిసి వేముల వీరేశం ప్రచారం నిర్వహించారు. చిట్యాల మండలంలోని పలు గ్రామాల్లో రోడ్ షో నిర్వహించి ప్రచారం చేశారు. మరో సారి తనకు అవకాశం ఇస్తే నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తానని ఆయన పేర్కొన్నారు. ఈ ఫ్లెక్సీ విషయం ఆనోటా…ఇనోటా.. తెరాస పెద్దలకు చేరినట్లు తెలుస్తోంది.