ప్రస్తుతం భారతదేశంలో దేశాభివృద్ధికి అవినీతి అనేది ఓ అవరోధంగా మారిందని భారతదేశ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వంతో పాటు ప్రజలు సంయుక్తంగా ఇందుకోసం పనిచేసి అవినీతిని దేశం నుండి పారదోలేందుకు కలిసి పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. నేడు ఆయన కాగ్ కార్యాలయ ఆవరణంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ ఓ మేధావంతుడని అభివర్ణించారు. ప్రపంచంలోని అన్ని దేశాల కంటే దృఢమైన రాజ్యాంగం భారతదేశం కలిగి ఉందని అది భారతదేశ ప్రత్యేకత అని తెలియజేశారు.
అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం నేటికీ ఓ మార్గదర్శిగా దారి చూపిస్తుందని ఆయన తెలిపారు. రాజ్యాంగ పవిత్రతను కాపాడడం ప్రతి భారతీయుడు పని చేయాలని ఆయన ప్రజలకు సూచించారు. పారదర్శకత సుపరిపాలన ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మలు అని ఆయన తెలిపారు. ప్రభుత్వ యంత్రాంగం లోపాలను సరిదిద్దుకొని కొత్త మార్పులు, చేర్పులతో మరింత సమర్థవంతంగా ముందుకెళ్లేందుకు కాగ్ ఇచ్చే నివేదికను ఎంతగానో ఉపయోగపడతాయని ఆయన చెప్పుకొచ్చారు. 2022 కల్లా కాగిత రహిత కార్యకలాపాలను నిర్వహించాలని నిర్ణయం నిజంగా అభినందనీయమని తెలిపారు.