కేఫ్ కాఫీ డే ఓనర్ వీజీ సిద్ధార్థ అంత్యక్రియలు ఇక్కడే!

-

కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు వీజీ సిద్ధార్థ ఆత్మహత్యపై మహీంద్ర గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కష్టకాలంలో ధైర్యంగా ఉండాలని పారిశ్రామిక దిగ్గజాలకు పిలుపునిచ్చారు. వ్యాపారంలో వచ్చిన నష్టాలకు తమ ఆత్మ గౌరవాన్ని నాశనం చేసే చాన్స్ ఇవ్వొద్దన్నారు. అదే జరిగితే పారిశ్రామికం అంతమైనట్టేనని పేర్కొన్నారు. నాకు ఆయన గురించి తెలియదు. ఆయన ఆర్థిక పరిస్థితుల గురించి కూడా అవగాహన లేదు. నాకు తెలిసిందల్లా పారిశ్రామిక వేత్తలు ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యాపారంలో వచ్చిన నష్టాలకు తమ ఆత్మగౌరవాన్ని నాశనం చేసే అవకాశం ఇవ్వొద్దు. ఇది పారిశ్రామికరంగం అంతానికి దారి తీస్తుంది… అని ఆనంద్ మహీంద్ర ట్వీట్ చేశారు.

58 ఏళ్ల వీజీ సిద్ధార్థ సోమవారం సాయంత్రం మంగళూరులో అదృశ్యమయ్యారు. నేత్రావతి నదిలోకి ఎవరో దూకడం చూశానంటూ ఓ జాలరి పేర్కొనడంతో పోలీసులు, కోస్టు గార్డులు, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు సంయుక్తంగా మంగళవారం గాలింపు జరిపాయి. విస్తృత గాలింపు అనంతరం ఇవాళ ఉదయం వీజీ సిద్ధార్థ మృతదేహం లభ్యమైంది. ఆదాయ పన్ను శాఖ వేధింపులు, వ్యాపారంలో నష్టాల కారణంగానే తాను తనువు చాలిస్తున్నానంటూ వీజీ సిద్ధార్థ తన సూస్డై నోట్‌లో పేర్కొన్నారు.

కేఫ్ కాఫీ డే అధినేత వీజీ సిద్ధార్థ్ అదృశ్యం, ఆ తర్వాత ఆత్మహత్య కథనాలు వెంట వెంటనే వెలువడటంతో.. బెంగళూరు నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ నేపథ్యంలో సినీ, రాజకీయ, వ్యాపార వర్గాల రాకతో ఆయన మామ, బీజేపీ అగ్రనేత ఎస్‌ఎం కృష్ణ నివాసం శాంభవి కిటకిటలాడింది. వరుస పరామర్శలతో ఆయన నివాసంలో ఉద్విగ్నభరిత వాతావరణం ఏర్పడింది. ఈ సందర్భంగా తనను కలిసిన బంధుమిత్రుల దగ్గర దేవుడు ఆడే ఆటలను అర్థం చేసుకోవడం కష్టం అంటూ ఎస్‌ఎం కృష్ణ వాపోయారు. ఎస్‌ఎం కృష్ణను పరామర్శించిన వారిలో కర్ణాటక సీఎం యడియూరప్ప, మాజీ ప్రధాని దేవెగౌడ, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి, మాజీ మంత్రులు డీకే శివకుమార్, సినీ ప్రముఖులు, సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఉన్నారు.

సిద్ధార్థ అంత్యక్రియలు ఇక్కడే!

కాఫీడే యజమాని సిద్ధార్థ అంత్యక్రియలు ఆయన తండ్రి కాఫీ ఎస్టేట్‌లో జరగనున్నట్లు సమాచారం. పోస్టుమార్టం అనంతరం సిద్ధార్థ మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. ఆయన మృతదేహాన్ని చిక్‌మగళూరు తీసుకెళ్లనున్నారు. అక్కడి నుంచి హసన్ జిల్లాలోని బెలూర్ తాలుకాలో గల సిద్ధార్థ తండ్రి ఎస్టేట్‌లో ఆయన అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబసభ్యులు నిర్ణయించినట్లు శృంగేరీ ఎమ్మెల్యే రాజేగౌడ తెలిపారు.

– కేశవ

Read more RELATED
Recommended to you

Exit mobile version