కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ తెలంగాణ పర్యటన రద్దు అయిన విషయం తెలిసిందే. జూన్ 2న కాంగ్రెస్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న తెలంగాణ దశాబ్ది వేడుకలకు వాలని ఆమెను ఆహ్వానించగా చివరి నిమిషంలో టూర్ క్యాన్సిల్ అయ్యింది. అయితే, అనారోగ్య కారణాలు, ఎండ వేడిమి వల్ల సోనియా పర్యటన రద్దు చేసుకున్నట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. ఈ క్రమంలో సోనియా తెలంగాణ టూర్ క్యాన్సిల్ కావడంపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వీహెచ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
గాంధీ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కొన్ని అనివార్య కారణాలతో సోనియా తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు రావడం లేదని క్లారిటీ ఇచ్చారు. అనారోగ్యం కారణంగా డాక్టర్ల సూచనతో ఆమె రెస్ట్ తీసుకుంటున్నారని తెలిపారు. సోనియా రాష్ట్రానికి రాకపోయిన ఆమె ఆశీస్సులు తెలంగాణకు ఎప్పుడు ఉంటాయని అన్నారు. సోనియా గాంధీ ఆదేశాలను, రాహుల్ గాంధీ ఆలోచనలను ముందుకు తీసుకెళ్తూ తెలంగాణలో పాలన చేస్తున్నామని అన్నారు.