భారత్–పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో “ఆపరేషన్ సిందూర్”పై జాతీయ, ప్రాంతీయ మీడియా విస్తృత కవరేజ్ ఇస్తున్నాయి. అయితే, వార్తా ప్రసారాల్లో ప్రజలను హెచ్చరించేందుకు వినియోగించే సైరన్‌లను ఉపయోగించొద్దని కేంద్రం మీడియా ఛానెళ్లకు స్పష్టమైన సూచనలు చేసింది.
ఈ శబ్దాల వినియోగం ప్రజల్లో భయాందోళనలు కలిగించే అవకాశం ఉన్నందున, మాక్ డ్రిల్‌ల సమయంలో మాత్రమే అవగాహన లక్ష్యంగా వాడాలని కేంద్ర హోంశాఖకు చెందిన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫైర్ సర్వీసెస్, సివిల్ డిఫెన్స్ & హోం గార్డ్స్ విభాగాలు సూచించాయి. “ఇలాంటి శబ్దాలను తరచూ వినిపిస్తే ప్రజలు వాటిని అమర్యాదగా తీసుకోవచ్చు. దీంతో నిజమైన అత్యవసర సమయాల్లో కూడా స్పందించకపోవచ్చు,” అని కేంద్రం హెచ్చరించింది.