ప్రధాని మోడీ అమెరికా పర్యటనపై విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలో ప్రజాతంత్ర పంథాలో పయనిస్తున్న రెండు అతిపెద్ద దేశాలు ఇండియా, అమెరికా మైత్రి నేడు రోజురోజుకు బలపడుతోంది. ఈ నెల 21–23 మధ్య జరిగే భారత ప్రధాని నరేంద్రమోదీ అమెరికా అధికార పర్యటనకు విశేష ప్రాధాన్యం ఉందన్నారు.
అనేక చారిత్రక కారణాలు, పరిస్థితుల వల్ల 1947 నుచి 1990ల ఆరంభం వరకూ భారత–అమెరికా ప్రజల మధ్య సుహృద్భావ సంబంధాలు ఉన్నంతగా ఈ రెండు దేశాల ప్రభుత్వాలు ఒకదానితో ఒకటి అంత దగ్గరగా లేవనే అభిప్రాయం నెలకొని ఉండేదని పేర్కొన్నారు. అప్పటి రెండు అగ్రరాజ్యాల మధ్య కొనసాగిన ప్రచ్ఛన్నయుద్ధం ప్రభావం రెండు ప్రజాస్వామ్య దేశాల పాలకులపై ఉండేదని రాజకీయ నిపుణులు చెబుతారు. అయితే, ప్రపంచీకరణ, సమాచార సాంకేతిక (ఐటీ) విప్లవం ఆధునిక ప్రపంచాన్ని కుగ్రామంగా మార్చే ప్రక్రియ మొదలైన 20వ శతాబ్దం చివరిలో ఇండియా, అమెరికా ప్రభుత్వాల మధ్య కూడా సంబంధాలు బలోపేతమయ్యాయన్నారు.
అన్ని రంగాల్లో రెండు పెద్ద దేశాల మధ్య స్నేహ, సహకార సంబంధాలు పటిష్ఠమవ్వడం మొదలైంది. అలా ఈ స్నేహబంధంలో వచ్చిన గొప్ప మార్పు ఈ పాతికేళ్లలో దృఢపడుతోంది. పెద్ద సంఖ్యలో ‘అవకాశాల స్వర్గం’ అమెరికా వెళ్లి స్థిరపడిన భారత సంతతి ప్రజలు ఈ మిత్ర సంబంధాలు మరింత పరిణతి చెందడానికి తమ వంతు కృషిచేస్తున్నారు. ప్రపంచంలో నేటి అత్యంత క్లిష్ట సమయంలో ఇండియాకున్న భౌగోళిక రాజకీయ ప్రాధాన్యమే అమెరికాకు కొత్త, అతి సన్నిహిత మిత్ర దేశంగా భారత్ అవతరించడానికి అతిపెద్ద కారణమని ప్రపంచ ప్రఖ్యాత ఇంగ్లిష్ పత్రిక ‘ది ఇకనామిస్ట్’ వ్యక్తం చేసిన అభిప్రాయం నూరు శాతం నిజమని అంతర్జాతీయ నిపుణులు అంగీకరిస్తున్నారని చెప్పారు విజయసాయి రెడ్డి. గతంలో అమెరికా, పూర్వపు సోవియెట్ యూనియన్ మధ్య తీవ్ర పోటీ ఉన్న సమయంలో భారత పాలకులు సోవియెట్ పక్షాన ఉన్న మాట కూడా నిజమేనని చరిత్రకారులు చెబుతారు. అయితే, ‘ఇండియాకు సోవియెట్ యూనియన్ ఆదర్శ రాజ్యమని అప్పట్లో ప్రకటించిన కొందరు పెద్దలు మాత్రం తమ పిల్లలను పై చదువులకు అమెరికా పంపేవారన్నారు విజయసాయి రెడ్డి.