సీఎం కేసీఆర్ జిల్లాల పర్యటన లపై బిజెపి నేత విజయశాంతి కౌంటర్ వేశారు. కేసీఆర్ గారి పర్యటనలు ఆప్రకటిత ఎమర్జెన్సీని తలపిస్తున్నాయని… ఈ పిచ్చి పర్యటనలు, మోసపు వాగ్దానాల వలన ప్రజలకు ఒరిగేదేమీ లేదని ఫైర్ అయ్యారు. అరెస్టులు, వేధింపుల కోసమే అన్నటుగా కేసీఆర్ పర్యటన ఉందని.. ప్రజల్ని రోడ్ల మీదకు రానివ్వకుండా ఎక్కడిక్కడ బారికేడ్లు పెట్టి అడ్డుకోవడం కేసిఆర్‌కే చెల్లిందన్నారు. కేసిఆర్ జిల్లాలకు వస్తే ఇంత నిర్బంధం ఉంటుందంటే… దాని బదులు ఆయన ఫామ్‌హౌస్‌లో ఉండడమే మంచిదని ప్రజలు అంటున్నారని చురకలు అంటించారు.
హుజురాబాద్ ఎన్నికల నేపథ్యంలో కేసీఆర్ గారికి అక్కడికి పోయే ధైర్యం లేకనే అటుపక్క సిద్ధిపేట జిల్లా, ఇటుపక్క వరంగల్ జిల్లా, పక్కనున్న యాదాద్రి జిల్లా పర్యటన చేస్తున్నట్లు అభిప్రాయం కలుగుతోందన్నారు. ఈ పర్యటనలో కొందరు పోలీసు అధికారులు – కనీసం ప్రతిపక్ష నాయకులనే గౌరవం లేకుండా వ్యవహరిస్తున్నారని… అది వారికీ, మంచిది కాదని పేర్కొన్నారు. అయినా… పేరుకి పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి తప్ప ఈ ప్రచార ఆర్భాటపు ముఖ్యమంత్రి గారి కాలక్షేపం పర్యటన వల్ల ప్రజల, నిరుద్యోగుల గతి మారుతున్నది ఏమీ లేదని విజయశాంతి మండిపడ్డారు.