పాల్వంచ ఘటనపై విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో అధికార పార్టీ నేతల అరాచకాలు ఏ స్థాయిలో మితిమీరిపోతున్నాయో చెప్పడానికి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో రామకృష్ణ కుటుంబానికి ఎదురైన విషాదానికి మించిన ఉదాహరణ మరొకటి కనిపించదని… ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో ద్వారా రామకృష్ణ బట్టబయలు చేసిన విషయాలు వింటే టీఆరెస్ నేతలు ఎంత రాక్షసంగా ప్రవర్తిస్తున్నారనేది అర్థమవుతుందని ఫైర్ అయ్యారు. రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య చేసుకుని వారం రోజులు గడుస్తున్నప్పటికీ ప్రధాన నిందితుడైన వనమా రాఘవను ఇంతవరకూ పోలీసులు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు.
ఈ సంఘటన తర్వాత మీడియా ముందుకు 2 సార్లు వచ్చిన రాఘవ ఆ తర్వాత కనిపించలేదని… రామకృష్ణ సెల్ఫీ వీడియో బయటపడిన వెంటనే రాఘవ కదలికలపై నిఘా పెట్టాల్సిన పోలీస్ యంత్రాంగం… అతను 2 సార్లు మీడియా ముందుకు వచ్చి మాయమయ్యే వరకూ ఎందుకు మౌనం దాల్చాల్సి వచ్చిందో ఈ పాలకులు చెప్పితీరాలని నిలదీశారు. నిజం చెప్పాలంటే రామకృష్ణ కుటుంబానిది ఆత్మహత్య కాదు.. వనమా కుటుంబం చేసిన హత్య అని… ఈ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు పెరిగిపోతుండటంతో తట్టుకోలేకే ఉద్దేశ్యపూర్వకంగానే రాఘవ అరెస్ట్ అంటూ లీకులిప్పించి ఆందోళనల్ని కట్టడి చేసేందుకు ప్రయత్నించినట్టు అర్థమవుతోందన్నారు. అన్నిటికంటే దారుణమైన విషయం ఏమిటంటే… గత 30 ఏళ్ళుగా సెటిల్మెంట్లు, భూ దందాలు, అత్యాచారాలు తదితర నేరాలకు పాల్పడినట్టు బలమైన ఆరోపణలు రాఘవపై ఉన్నాయని స్థానికుల సమాచారం ఆధారంగా మీడియాలో కథనాలు వచ్చాయని గుర్తు చేశారు.
అతనిపై ఇప్పటికే పలు కేసులున్నాయి. మరీ ఈ సంగతులేవీ తెలియకుండానే అతన్ని టీఆరెస్‌లోకి తీసుకున్నారా? టీఆరెస్ నేతలకు తెలియవా? కాదంటే నమ్మమంటారా? అని ప్రశ్నించారు. అరాచకవాదులకు అండగా నిలుస్తూ రాష్ట్ర ప్రతిష్టను మట్టిపాలు చేస్తున్న ఈ టీఆరెస్ సర్కారును అదే మట్టిలో కలిపేందుకు జనం సిద్ధంగా ఉన్నారని మర్చిపోవద్దు అని పేర్కొన్నారు.