తిరుమలలో ఆ రెండ్రోజులు బ్రేక్‌ దర్శనాలు రద్దు

-

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఈనెల 22న శ్రీ శోభకృత్‌ నామ సంవత్సర ఉగాది ఆస్థానాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని టీటీడీ ప్రకటించింది. ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని సుప్రభాత సేవ అనంతరం ఆలయాన్ని శుద్ధి చేయనున్నారు.

మరోవైపు పర్వదినాన్ని పురస్కరించుకొని మార్చి 22వ తేదీన శ్రీవారి ఆలయంలో నిర్వహించే ఆర్జిత బ్రహ్మోత్సవం, కళ్యాణోత్సవం, ఊంజల్‌ సేవను రద్దు చేస్తున్నట్లు టీటీడీ తెలిపింది. అంతేకాకుండా 21, 22వ తేదీల్లో వీఐపీ బ్రేక్‌ దర్శనాలను రద్దు చేయడమే కాకుండా.. ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించబోమని స్పష్టం చేసింది. భక్తులు ఈ విషయాలను గమనించి సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేసింది.

ఇక ఉగాది పర్వదినాన ఉదయం 6 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామికి, విష్వక్సేనులకి విశేష సమర్పణ చేస్తారు. ఉదయం 7 నుంచి 9 గంటల మధ్య విమాన ప్రాకారం, ధ్వజస్తంభం చుట్టూ ఊరేగింపుగా ఆలయంలోనికి ప్రవేశిస్తారు. ఆ తర్వాత శ్రీవారి మూలవిరాట్టుకు, ఉత్సవ మూర్తులకు నూతన వస్త్రాలను ధరింపజేస్తారు. అనంతరం పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు. ఉగాది ఆస్థానాన్ని బంగారు వాకిలి వద్ద ఆగమ పండితులు, అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారని టీటీడీ వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Latest news