టీ20 వరల్డ్ కప్‌లో ఇటీవల దాయాది జట్లు తలపడడం.. ఆ మ్యా్‌చ్‌లో విరాట్ విశ్వరూపం చూపించిన విషయం తెలిసిందే. అయితే.. క్రికెట్ మ్యాచ్ జరుగుతోందంటే భారతదేశంలో జనం టీవీలకు అతుక్కుపోతుంటారు.. అందులోనూ పాకిస్తాన్ తో మ్యాచ్ అంటే క్రేజ్ మామూలుగా ఉండదు. కొన్ని కంపెనీలు ఉద్యోగుల కోసం ఏకంగా సెలవు కూడా ఇస్తుంటాయి. అయితే, ఈసారి మ్యాచ్ ఆదివారం జరగడంతో జనమంతా మధ్యాహ్నం నుంచే టీవీల ముందు సెటిలయ్యారు. తెల్లారితే దీపావళి అయినా ఇంట్లో నుంచి కదల్లేదు. పండుగ షాపింగ్ మొత్తం ఆన్ లైన్ లో కానిచ్చేద్దామని భావించారు. ఉదయం నుంచి కళకళలాడిన ఆన్ లైన్ షాపింగ్ సైట్లు మధ్యాహ్నానికి వెలవెలబోయాయి. ఓ దశలో ఆన్ లైన్ లో యూపీఐ ట్రాన్సాక్షన్లు దాదాపుగా నిలిచిపోయాయి. విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేస్తుండగా జరిగిందిది. మ్యాచ్ రసవత్తరంగా జరగడం, చివరి ఓవర్ లో నరాలు తెగే ఉత్కంఠతో సాగడంతో ఆన్ లైన్ షాపింగ్ సైట్లను తెరిచేవారే లేకుండాపోయారు.
దీపావళి సందర్భంగా ఆన్ లైన్ షాపింగ్ ఆదివారం సాధారణం కంటే ఎక్కువే ఉంది. ఉదయం 9 గంటలతో పోలిస్తే 10:30 నుంచి 12:30 మధ్యలో యూపీఐ ట్రాన్సాక్షన్లు 15 శాతం ఎక్కువగా నమోదయ్యాయి. ఆ తర్వాత మధ్యాహ్నం మ్యాచ్ మొదలయ్యే ముందు యూపీఐ ట్రాన్సాక్షన్లు తగ్గిపోయాయి. అంటే జనం ఆన్ లైన్ షాపింగ్ చేయడం తగ్గించి మ్యాచ్ చూడడంలో మునిగిపోయారు. పాకిస్తాన్ బ్యాటింగ్ పూర్తయ్యాక కొద్దిగా పెరిగి, భారత్ బ్యాటింగ్ మొదలైన 3:30 గంటల ప్రాంతంలో యూపీఐ ట్రాన్సాక్షన్లు మళ్లీ తగ్గాయి. చివరి ఓవర్ లో కోహ్లీ బ్యాటింగ్ చేస్తుంటే ఆన్ లైన్ షాపింగ్ సైట్లు తెరిచేవాళ్లే కరువయ్యారు. మ్యాచ్ పూర్తయ్యాక యథావిధిగా షాపింగ్ సైట్లు కళకళలాడాయి.