టీడీపీ నేత, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడికి న్యాయస్థానంలో ఊరట లభించింది. ఇవాళ తెల్లవారుజామున అయ్యన్నతో పాటు ఆయన కుమారుడు రాజేశ్‌ను అరెస్టు చేసిన సీఐడీ పోలీసులు విశాఖ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరు పర్చారు. నిబంధనలకు విరుద్ధంగా అయ్యన్నను అరెస్టు చేశారని ఆయన తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఇరు వైపులా వాదనలు విన్న న్యాయమూర్తి.. అయ్యన్న రిమాండ్ ను తిరస్కరించారు. ఈ కేసులో 467 సెక్షన్ వర్తించదని స్పష్టం చేసిన న్యాయస్థానం.. 41ఏ నోటీసు ఇచ్చి తదుపరి చర్యలు తీసుకోవచ్చని ఆదేశించింది.
అయ్యన్నపాత్రుడు, ఆయన కుమారుడు రాజేశ్ అరెస్టుపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు ఏపీ హైకోర్టు నిరాకరించింది. కేసు డైరీ చూశాకే నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేస్తూ విచారణ రేపటికి వాయిదా వేసింది. రేపు ఉదయం 10.30 కల్లా కేసు డైరీ తమ ముందు ఉంచాలని సీఐడీని హైకోర్టు ఆదేశించింది.