హుజూరాబాద్ ఉపఎన్నికలో ఓటు వేసేందుకు ఓటర్లు పోటెత్తారు. అసలు ఉదయం నుంచి ఓటర్లు…పోలింగ్ బూతుల వద్ద బార్లు తీరారు. గంట గంటకు పోలింగ్ శాతం పెరిగిపోతుంది. ఇప్పటికే మధ్యాహ్నం 3 గంటల సమయానికి పోలింగ్ 60 శాతం దాటింది. దాదాపు 62 శాతం పోలింగ్ నమోదైనట్లు తెలుస్తోంది. అంటే పోలింగ్ ముగిసే సమయానికి ఇంకా భారీగా పోలింగ్ శాతం నమోదయ్యేలా ఉంది. అంటే హుజూరాబాద్ ఓటర్లు ఓటు వేయడానికి బాగా ఆసక్తిగా ఉన్నారని అర్ధమవుతుంది.
అయితే ఓటర్లు ఎవరి పక్షాన ఉన్నారో ఇప్పుడే క్లియర్‌గా అర్ధం కావడం లేదు…కానీ గంట గంటకు పెరిగే పోలింగ్ శాతం ఎవరికి అనుకూలంగా మారుతుందో అర్ధం కాకుండా ఉంది. మరోవైపు హుజూరాబాద్‌లో ప్రధాన పార్టీలు హోరాహోరీగా పోలింగ్ బూతుల వద్ద హల్చల్ చేస్తున్నారు. ప్రధానంగా అధికార టీఆర్ఎస్ నేతలు ఇంకా ప్రలోభాలకు గురి చేస్తున్నట్లు తెలుస్తోంది. అటు టీఆర్ఎస్ నేత కౌశిక్ రెడ్డి ప్రతి గ్రామానికి వెళ్ళి పోలింగ్ బూతుల వద్ద హడావిడి చేస్తున్నారు. అయితే కౌశిక్ రెడ్డిని జనం ఎక్కడకక్కడే అడ్డుకుని వెనక్కి తిరిగి పంపించేస్తున్నారు.
ఇటు ఈటల రాజేందర్ కాన్వాయ్‌కు చెందిన మూడు వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. అనుమతి లేకుండా తిరుగుతున్నారని చెప్పి ఈటల రాజేందర్ పీఆర్వోను కూడా అదుపులోకి తీసుకున్నారు. అలాగే వర్ధన్నపేట టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ పీఏ కిరణ్ డబ్బులు పంచుతుండగా బీజేపీ కార్యకర్తలు పట్టుకున్నారు.
ఇదిలా ఉంటే భారీగా పెరుగుతున్న పోలింగ్ శాతం ఎవరికి గెలుపుకు సంకేతం అవుతుందో క్లారిటీ రావడం లేదు. అయితే పోలింగ్ శాతం పెరిగితే ఈటలకే బెనిఫిట్ అవుతుందని కొందరు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. గతంలో 84.4 శాతం ఓటింగ్ నమోదు అవగా, ఇప్పుడు ఎంత అవుతుందనేది ఉత్కంఠగా మారింది. మరి చూడాలి ఈ భారీ పోలింగ్ శాతం ఎవరికి అనుకూలంగా మారుతుందో?