తాజాగా ప్రముఖ సినీ దర్శకుడు వివి.వినాయక్ ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డితో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది. బుధవారం తాడేపల్లిలోని ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లిన వినాయక్ జగన్ ను కలిసి సన్మానించారు. అరగంట పాటు వినాయక్ జగన్‌తోనే భేటీ అయ్యారు. జగన్ సీఎంగా విజయం సాధించాక ఇండస్ట్రీ పెద్దలు ఎవ్వరూ వెళ్లి జగన్‌ను కలవలేదని పృథ్వి, పోసాని లాంటి వాళ్లు విమర్శలు చేశారు. ఇక ఇటీవల మెగాస్టార్ చిరంజీవి దంపతులు స్వయంగా జగన్ ఇంటికి వెళ్లి జగన్‌ను సైరా నరసింహారెడ్డి సినిమా చూడాలని విజ్ఞప్తి చేశారు.
ఇక ఇండస్ట్రీలో పెద్ద తలకాయలుగా చెప్పుకునే నిర్మాతలు ఎవ్వరూ జగన్‌ను కలవలేదు. అయితే సురేష్‌బాబు లాంటి వాళ్లు మాత్రం జగన్‌ను కలిసేందుకు తాము అపాయింట్‌మెంట్ అడిగిన మాట వాస్తవమే అని చెప్పారు. అయినా వాళ్లు ఇప్పటకీ జగన్‌ను కలవకపోగా.. వినాయక్ ఇలా అడిగిన వెంటనే అలా అపాయింట్‌మెంట్ ఖరారు కావడంతో పాటు ఏకంగా అరగంట పాటు వీరిద్దరు చర్చించుకోవడం రాజకీయ వర్గాల్లోనూ సంచనలంగానే మారింది.
వినాయక్ ఫ్యామిలీ ముందు నుంచి వైఎస్ ఫ్యామిలీతో ఎంతో అనుబంధంతో ఉంటున్నారు. గతంలో వినాయక్ తండ్రి కృష్ణారావు చాగల్లు సర్పంచ్‌గా పనిచేశారు. ఆ తర్వాత ఆ కుటుంబం అంతా వైసీపీలో యాక్టివ్‌గా ఉంటున్నారు. గత ఎన్నికలకు ముందే వినాయక్ రాజమండ్రి నుంచి ఎంపీగా పోటీ చేస్తారన్న ప్రచారం జరిగినా ఆయన పోటీ చేయలేదు. వినాయక్ సోదరులు అంతా అక్కడ ఎంపీగా పోటీ చేసిన మార్గాని భరత్ గెలుపుకోసం కష్టపడ్డారు.
సోదరుడికి జిల్లా స్థాయి పదవి కోసమే లాబీయింగ్ :
గతంలో తండ్రికి పదవి కోసం వినాయక్ అప్పట్లో రాష్ట్ర స్థాయిలో లాబీయింగ్ చేశారు. ఇక ఇప్పుడు తన సోదరుడిక జిల్లా స్థాయి పదవి కోసమే వినాయక్ జగన్‌ను కలిసినట్టు జిల్లాలో ప్రచారం జరుగుతోంది. ఇక వినాయక్ జక్కంపూటి ఫ్యామిలీతో ఎంతో సన్నిహితంగా ఉంటారు. ఆ ఫ్యామిలీకే చెందిన జక్కంపూడి రాజా కాపు కార్పొరేషన్ చైర్మన్‌గా ప్రమాణస్వీకారం చేసినప్పుడు కూడా వినాయక్ వచ్చి జగన్‌ను ఆకాశానికి ఎత్తేశాడు.
ఇక ఇప్పుడు వినాయక్ – జగన్ భేటీలో సైతం సోదరుడికి జిల్లా స్థాయి పదవి అంశంపైనే ప్రముఖంగా చర్చ జరిగినట్టు తెలుస్తోంది. అయితే వినాయక్ కోరికపై జగన్ ఎలా స్పందించారన్నది మాత్రం తెలియడం లేదు. జగన్‌తో భేటీ విషయంపై వినాయక్ ఏం స్పందించకపోవడంతో అసలేం జరిగిందన్నది మాత్రం ఆసక్తిగానే ఉంది.