ఆకలితో 500 కిలోమీటర్లు నడిచి చచ్చిపోయాడు…!

-

లాక్ డౌన్ కష్టాలు డబ్బు ఉన్నవాడికి పెద్దగా తెలియదు గాని డబ్బు లేని వాళ్లకు మాత్రం మామూలు నరకం కాదు. ప్రజలు ఒక్కసారిగా నరక కూపంలోకి వెళ్ళిపోయారు. కరోనాను కట్టడి చెయ్యాలి అంటే అది మినహా మరో మార్గం లేదు ఇప్పుడు. వేలాది మంది రోడ్ల మీద తిండి లేక నానా అవస్థలు పడుతున్నారు. నా అన్న వాడు లేని జీవితాలు ఎన్నో. మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కోట్ల మంది పని చేస్తున్నారు.

వలస కూలీలు ఎక్కువగా ఉన్నారు వీరిలో. అయితే లాక్ డౌన్ దెబ్బకు వాళ్లకు తినడానికి తిండి లేక ఇళ్ళకు వెళ్ళడానికి వాహన సదుపాయం లేక నానా బాధలు పడుతూ వేల కిలోమీటర్లు కాలి నడకన వెళ్తున్నారు. ఇలా వెళ్ళే తమిళనాడుకి చెందిన ఒక యువకుడు ప్రాణాలు కోల్పోయారు. తమిళనాడుకు చెందిన లోగేష్‌ బాల సుబ్రహ్మణ్యం నాగపూర్‌ లో వలస కార్మికుడిగా పనిచేస్తున్నాడు.

లాక్ డౌన్ తో తినడానికి తిండి లేకపోవడంతో కాలి నడకన తన స్వగ్రామం తమిళనాడులోని నమక్కళ్‌కు బయలుదేరాడు. మూడు రోజుల నుంచి దాదాపు 500 కిలోమీటర్లు నడుస్తూ… సికింద్రాబాద్‌ చేరుకునే సమయంలో తీవ్ర అస్వస్తతకు గురై పడిపోయాడు. స్థానికులు అతన్ని గమనించి ఓ షెల్టర్‌ హోంకు తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.

పోస్ట్‌మార్టం నిమిత్తం అతని మృతదేహాన్ని వైద్యులు గాంధీ ఆస్పత్రికి తరలించగా… ఎక్కువ దూరం నడవడం మూలంగా డీహైడ్రేషన్‌తో మృతి చెందాడని వైద్యులు పేర్కొన్నారు. మృతదేహాన్ని స్వస్థలానికి పంపించే ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు వివరించారు. ఇలా దేశ వ్యాప్తంగా వేలాది మంది కూలీలు నడుస్తూ వెళ్తూ ప్రాణాలు కోల్పోతున్నారు. దీనిపై ఆందోళన వ్యక్తమవుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version