వరంగల్ భద్రకాళి ఉత్సవాలకు సర్వం సిద్దం చేస్తున్నారు అధికారులు. ప్రతీఏటా ఆశ్వీయుజ మాసంలో నిర్వహించే దేవీ నవరాత్రులకు రావాల్సిందిగా సీఎం కేసీఆర్ ను ఆహ్వానించారు దేవాదయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి. ఉత్సవాలకు సంబంధించిన ఆహ్వాన పత్రికను కేసీఆర్ కు అందించారు. ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఆలయ ప్రధానార్చకులు శేషు, ఈవో తో కలిసి సీఎం క్యాంప్ ఆఫీసుకు వెళ్లిన మంత్రి…కేసీఆర్ ను కలిసి ఉత్సవాల తేదీలను వివరించారు.
ఈ సందర్భంగా ఉత్సవాలకు సంబంధించిన వాల్ పోస్టర్లు, కరపత్రాలను ముఖ్యమంత్రి చేతుల మీదుగా విడుదల చేశారు. కరోనా కారణంగా ఈ సారి ఉత్సవాలను అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ నిర్వహిస్తున్నట్టు చెప్పారు అధికారులు. శుక్ల పాడ్యమి నుంచి అమ్మవారి నవరాత్రులను వైభవంగా నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు రోజుకో రూపంలో భక్తులను కనువిందు చేయనుంది.