పేరుకే కెప్టెన్ అవ్వొచ్చు కానీ.. మిగిలిన 11 మంది సక్రమంగా ఆడితేనే క్రికెట్ మ్యాచ్ గెలుస్తారు! అలాగే ముఖ్యమంత్రి ఒక్కరే సిన్సియర్ గా ఉన్నా… మిగిలిన 150 మంది ఎమ్మెల్యేలూ సక్రమంగా ఆలోచిస్తేనే వైకాపా నెతలు కలలుగంటున్న 20ఏళ్ల అధికారం కల సజీవంగా ఉండే అవకాశం ఉంది. అలాకాని పక్షంలో జగన్ కష్టం, ప్రజల కోరిక బూడిదలోపోసిన పన్నీరే అవుతుందనడంలొ సందేహం లేదు!
ఇంతకాలం ప్రశాంతంగా సాగుతున్న ఏపీ అధికారపార్టీలో విమర్శలకు తావిచ్చిన అంశం ఏదైనా ఉందంటే… అది కచ్చితంగా పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ వ్యవహారం అనడంలో సందేహం లేదు. దాదాపు ప్రతీ జిల్లా నుంచి, ప్రతీ నియోజకవర్గం నుంచి ఈ వ్యవహారంలో విమర్శలు వస్తూనే ఉన్నాయి. సరైన భూములు కొనలేదనో.. అధికధరలకు కొన్నారనో.. ప్రభుత్వ స్థలాలు ఉన్నా కూడా నాయకుల స్థలాలు కొన్నారనో.. అర్హులను గుర్తించడంలో విఫలమయ్యారనో.. రకరకాల విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే.
ఇందులో భాగంగా తాజాగా గుంటూరు జిల్లాలో జరిగిన వ్యవహారం వెలుగులోకి రావడంతో… విషయం సీబీఐ వరకూ వెళ్లిందని తెలుస్తోంది. గుంటూరు జిల్లా అమరావతి మండలం ధరణికోట, ముత్తాయపాలెం గ్రామాల్లో రైతులు ఇద్దరు గుంటూరులోని లక్ష్మీపురం సెంట్రల్ బ్యాంక్‌లో తాకట్టు పెట్టి రూ1.2 కోట్లు రుణం పొందిన భూమినే తిరిగి పేదలకు ఇళ్లు పథకంకింద సేకరణ చేపట్టారనే వార్త ఇప్పుడు స్థానికంగా సంచనలం అవుతుంది. ఈ భూమికి సంబంధించిన అన్ని పత్రాలూ బ్యాంకులోనే ఉండగా.. నకిలీ పత్రాలు సృష్టించి.. స్థానిక నేతలు – అధికారులు కలిసి ఇదే భూమిని పేదలకు పంచే స్థలాలకు సేకరించారని తెలుస్తోంది.
వాస్తవానికి ఎకరా రూ.15 – 20 లక్షల కంటే ఎక్కువ పలకని ఈ భూములను ఎకరం రూ.55-60 లక్షల చొప్పున ప్రభుత్వం కొనడం… కానీ అందులో 20 – 25 లక్షలు మాత్రమే రైతుకు ఇవ్వడం… మిగిలిన సొమ్ము అవినీతి ఖాతాలో జమ అవ్వడం జరుగుతుందని విమర్శలు వస్తున్నాయి. ఈ వ్యవహారం బ్యాంకు అధికారుల దృష్టికి రావడం.. పోలీసులకు ఫిర్యాదు చేయడం.. ఫలితంగా వ్యవహారం సీబీఐ రంగంలోకి దిగడం జరిగిపోయాయి. ఇది మచ్చుకు ఒక ఉదాహరణ మాత్రమే అని… ప్రధానంగా గుంటూరు జిల్లాలోని దాదాపు ప్రతీ నియోజకవర్గంలోనూ ఇలాంటి సంఘటనలు పుష్కలంగా ఉన్నాయని తెలుస్తోంది.
మరి జగన్ ఈ విషయాలపై దృష్టి పెడతారా.. భూముల విషయంలో మరోసారి అత్యంత జాగ్రత్తగా చర్యలు తీసుకుంటారా.. లేక చూసీచూడనట్లు వదిలేస్తారా అనేది తెలియాల్సి ఉంది. ఈ విషయంలో జగన్ ఒక్కడే నిజాయితీగా ఆలోచిస్తే సరిపోదు.. మిగిలిన ఎమ్మెల్యేలు కూడా బాధ్యతతో మెలగాలని.. ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చే ఇలాంటి కక్కుర్తి పనులు మానుకోవాలని వైకాపా అభిమానులు కోరుకుంటున్నారు… బాధ్యతుండక్కరలేదా అని ప్రశ్నిస్తున్నారు!!