కోవిడ్ 19 నుండి రికవరీ అయ్యాక కూడా చాలామందిలో కొన్ని అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడుతున్నాయి. అధిక అలసట, పనిచేయాలని అనిపించకపోవడం, బలహీనత, మతిమరుపు మొదలగు సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. కరోనా నుండి రికవరీ అయ్యాక కనిపిస్తున్న ఈ లక్షణాలని దూరం చేసుకోవడానికి ఆరోగ్య నిపుణులు కొన్ని చిట్కాలను అందించారు. అవేంటో తెలుసుకుని రికవరీ అయ్యాక వచ్చే సమస్యల నుండి దూరంగా ఉండండి.
ఐసోలేషన్
మీ శరీరం బలహీనంగా ఉన్నప్పుడు ఐసోలేషన్ లో ఉండడం మంచిది. ఎందుకంటే బలహీనంగా ఉన్నప్పుడు రోగాలు తొందరగా అంటుకుంటాయి. కాబట్టి కొన్ని రోజులు ఐసోలేషన్లో ఉండండి.
విశ్రాంతి
సరైన విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం. శరీరానికే కాదు మెదడుకి కూడా ఇది ముఖ్యమైనది. టీవీ చూడడం, సోషల్ మీడియా, స్మార్ట్ ఫోన్లు ముట్టుకోవద్దు. యోగా, ధ్యానం, శ్వాస సంబంధ వ్యాయామాలు చేయవచ్చు. చక్కటి సంగీతం, మసాజ్ ఆయిల్స్ కూడా మేళు చేస్తాయి. ఒత్తిడి, ఎక్కువ శ్రమతో కూడుకున్న వర్కౌట్లు చేయవద్దు.
నిద్ర
కావాల్సినంత నిద్ర శరీరాన్ని, మెదడుని ఆరోగ్యంగా ఉంచుతుంది. సరైన సమయంలో నిద్రపోండి. రోజూ అదే ఫాలో అవ్వండి. నిద్రపోయే ముందు కాఫీ, టీ తాగవద్దు. అలాగే ఫోన్ వాడవద్దు. అన్నింటినీ పక్కన విసిరేసి హాయిగా నిద్రపోండి.
పోషణ
మీ శరీరానికి కావాల్సిన అన్ని పోషకాలు అందుతున్నాయా లేదో చూసుకోండి. విటమిన్లు, ఖనిజాలు శరీర పోషణకి చాలా అవసరం. కావాల్సినన్ని నీళ్ళు తాగండి. శరీరాన్ని బలహీనమవడానికి నీళ్ళు సరిగ్గా తాగకపోవడమూ ఓ కారణమే. ఆరెంజ్ జ్యూస్, పుచ్చకాయ జ్యూస్, కొబ్బరి నీళ్ళు వంటి ద్రవపదార్థాలు తాగండి.
తక్కువ శ్రమ
శ్రమ తక్కువగా ఉండే పనులు మాత్రమే చేయండి. అనవసరంగా బరువులు పైకి ఎత్తడం వంటివి చేయవద్దు. మానసికంగా కూడా ఎక్కువ ఆలోచించి ఒత్తిడి పెంచుకోవద్దు.
నవ్వండి
మీ చుట్టుపక్కల ఉన్నవారితో హ్యాపీగా ఉండండి. చిన్న చిన్న గేమ్స్ ఆడండి. దానివల్ల తొందరగా రికవరీ అవుతారు.