మరో రెండు, మూడు నెలల్లో అటు పార్లమెంట్ లోక్‌సభ ఎన్నికలు జరగనున్న విషయం విదితమే. అయితే అదే సమయానికి అటు ఏపీలోనూ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అధికార పక్షమైన టీడీపీ ప్రజలను ఆకట్టుకునేలా నిన్నటి బడ్జెట్‌ను ప్రవేశపెట్టగా, మరోవైపు మహిళలతోపాటు అన్ని వర్గాలకు తాయిలాలను అందించే పనిలో నిమగ్నమయ్యారు. ఇక ప్రతిపక్ష పార్టీ అయిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ మరిచిపోయిన వాగ్దానాలను, నాయకులు పాల్పడుతున్న అవినీతి పనులను ఎండగడుతూ ప్రజల మద్దతుతో ముందుకు సాగుతోంది. మరోవైపు వైకాపా అటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గానే ఉంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఓ కొత్త వెబ్‌సైట్‌తో వైకాపాకు చెందిన అభిమానులు ముందుకు వచ్చారు. అందులో చంద్రబాబు ప్రభుత్వం వల్ల నష్టపోయిన బాధితులను వారు ఏకం చేసే ప్రయత్నం చేస్తున్నారు.
https://www.ninnunammambabu.com/ ఇదే వెబ్‌సైట్.. దీన్ని నిర్వహిస్తున్న వారి పేర్లు, ఇతర వివరాలు తెలియవు.. కానీ ఇందులో ఏపీ అధికార పార్టీకి వ్యతిరేకంగా పోస్టు దర్శనమిస్తోంది. అంటే ఈ వెబ్‌సైట్ నిర్వాహకులు వైకాపా అభిమానులన్నట్లే మనకు స్పష్టమవుతుంది. ఇక ఇందులో.. వారు బాబు ప్రభుత్వం వల్ల, ఆ పార్టీ నాయకుల వల్ల నష్టపోయిన వారు లేదా వారికి తెలిసిన ఎవరైనా నష్టపోయిన వారి వివరాలను తెలియజేయాలంటూ.. రెండు ప్రత్యేక ఫాంలను ఉంచారు. అందులో బాబు ప్రభుత్వం, ఆ పార్టీ నాయకుల వల్ల నష్టపోయిన వారి పేరు, ఫోన్ నంబర్, నియోజకవర్గం, సమస్య వివరాలు, అందుకు సంబంధించిన రుజువులతో కూడిన పత్రాలను అటాచ్ చేసేందుకు ప్రత్యేక అప్‌లోడ్ ఫాంలను ఉంచారు. అంటే.. టీడీపీ హయాంలో ఈ నాలుగున్నర ఏళ్లుగా ఎవరైనా నష్టపోయి ఉంటే ఆ ఫాంలను ఉపయోగించుకుని తమ సమస్యలను నేరుగా వైఎస్ జగన్‌ను చెప్పవచ్చన్నమాట.
సాధారణంగా ఒకప్పుడు ఎన్నికలు వస్తున్నాయంటే పోరు బహిరంగంగానే ఉండేది. కానీ ఇప్పుడు సోషల్ మీడియాకు అది పాకింది. దీంతో సోషల్ మీడియానే ప్రధాన అస్త్రంగా చేసుకుని రాజకీయ పార్టీలు ముందుకు దూసుకెళ్తున్నాయి. ప్రతిపక్ష పార్టీల వైఫల్యాలను ఎండగడుతూ సోషల్ మీడియా ద్వారా ప్రజలకు దగ్గరవుతూ రాజకీయ పార్టీలు చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. సరిగ్గా ఇదే కోవలో వైసీపీ కూడా ముందుకు వెళ్తోంది. ఆ పార్టీకి ఇప్పుడు ప్రధాన బలం సోషల్ మీడియానే అని చెప్పవచ్చు. అందుకనే ఆ పార్టీ అభిమానులు నిన్ను నమ్మం బాబు అనే వెబ్‌సైట్‌తో ముందుకు వచ్చారు.
గత నాలుగున్నర సంవత్సరాలుగా టీడీపీ ప్రభుత్వం అసమర్థ పాలన చేస్తుందని, దాంతో ప్రజల జీవితాలు అతలాకుతలమవుతున్నాయని, ఏపీలో ఇప్పుడు అంతులేని సమస్యలు తాండవం చేస్తున్నా పాలకులు పట్టించుకోవడం లేదని, మరోవైపు దేశంలోని ఇతర రాష్ట్రాలు ప్రగతి పథంలో దూసుకుపోతున్నాయని.. నిన్ను నమ్మం బాబు వెబ్‌సైట్‌లో సందేశం ఇచ్చారు. అలాగే అందులో… మరిన్ని సమస్యలను చెప్పారు. రైతులకు రుణమాఫీ అందజేయలేదని, నిరుద్యోగ సమస్య పెరిగిందని, పేదలకు ఇండ్లు లేవని, డ్వాక్రా మహిళలకు రుణాలు మాఫీ చేయలేదని, ప్రత్యేక హోదా పేరుతో ప్రజలను వంచించారని, మహిళల భద్రత రోజు రోజుకీ ప్రశ్నార్థకం అవుతుందని.. ఇలా వేల సమస్యలు ఇప్పుడు ఏపీ ప్రజలకు ఎదురవుతున్నాయని.. ఆ సైట్‌లో పోస్టు పెట్టారు. దీంతోపాటు పచ్చ ప్రభుత్వం అరాచక పాలన కొనసాగిస్తుందని, ప్రభుత్వ వల్ల అన్యాయం జరిగిన వారు లక్షల్లో ఉన్నారని, తమ సమస్యలను వారు తెలియజేయాలని.. నిన్ను నమ్మం బాబు సైట్‌లో పిలుపునిచ్చారు.
దేశంలోని ప్రధాన సర్వే కంపెనీలు చేసిన సర్వేలన్నీ ఏపీ ప్రతిపక్ష నేత జగన్ కాబోయే సీఎం అవుతారంటూ చెబుతుండగా… మరో వైపు టీడీపీ ప్రభుత్వం మాత్రం బాబే సీఎం అవుతారని బాకాలు ఊదుతోంది. అయితే నేతలు జబ్బులు చరుచుకుని గెలుపు మాది అన్నంత మాత్రాన గెలవరు. ప్రజల ఆమోదం ఎవరికి లభిస్తుందో వారే ప్రజా ప్రతినిధులు అవుతారు. ఈ విషయానికి వస్తే ప్రస్తుతం జగన్‌కు ప్రజల మద్దతు పరిపూర్ణంగా ఉన్నట్లు మనకు తెలుస్తుంది. దీంతో ఏపీ కాబోయే సీఎం జగన్ అని ఎవరైనా చెబుతారు. కానీ ప్రజా కోర్టులో ఏమైనా జరగవచ్చు కదా.. మనం అనుకున్నది జరిగే వరకు వేచి చూడక తప్పదు..!