వివాహేతర సంబంధాలన్నీ విషాదాలకే దారి తీస్తాయని చెప్పేందుకు ఈ సంఘటన ఒక ప్రత్యక్ష నిదర్శనం. ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్‌గా పనిచేస్తున్న ఓ వ్యక్తి తన దగ్గర పనిచేస్తున్న డ్రైవర్ భార్యతో అక్రమ సంబంధం పెట్టుకోవడమేగాక, ఆ పని వద్దని చెప్పినందుకు గాను ఆ డ్రైవర్‌ను అతి కిరాతకంగా హత్య చేసి చంపేశాడు ఆ డాక్టర్. మధ్యప్రదేశ్‌లోని హోషంగాబాద్‌లో జరిగిన ఈ సంఘటన స్థానికంగా సంచలనం రేపుతోంది. వివరాల్లోకి వెళితే…
మధ్యప్రదేశ్‌లోని హోషంగాబాద్‌లో ఉన్న ఆనంద్ నగర్ కాలనీలో డాక్టర్ సునీల్ మంత్రి (56) తన భార్యతో కలిసి ఉండేవాడు. అయితే సునీల్ భార్య గతంలో బొటిక్ నడుపుతుండేది. కానీ ఆమె అనుకోకుండా మృతి చెందింది. ఈ క్రమంలో ఆమె దగ్గర పనిచేసిన వీరేంద్ర పచౌరి అనే వ్యక్తి భార్యకు బొటిక్ బాధ్యతలను సునీల్ అప్పగించాడు. అయితే ఆ బొటిక్ సునీల్ ఇంట్లోనే ఉండడంతో పచౌరి భార్య రోజూ ఆ ఇంటికి వెళ్లి వచ్చేది. ఈ క్రమంలో సునీల్‌కు, పచౌరి భార్యకు మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ఆ విషయం పచౌరికి తెలియడంతో సునీల్‌కు అతను వార్నింగ్ ఇచ్చాడు. తన భార్యతో చనువుగా ఉండడం ఆపేయాలని పచౌరి సునీల్‌కు చెప్పాడు. అయినా సునీల్ వినలేదు.
అయితే సునీల్ పచౌరిని మచ్చిక చేసుకునేందుకు అతనికి తన దగ్గరే డ్రైవర్ జాబ్ ఇచ్చి, నెలకు రూ.16వేల జీతం ఇవ్వడం ప్రారంభించాడు. ఇలా చేస్తే పచౌరి తమను చూసీ చూడకుండా వదిలేస్తాడని సునీల్ అనుకున్నాడు. కానీ పచౌరి మాత్రం డాక్టర్ సునీల్‌ను బెదిరించడం ఆపలేదు. కాగా ఈ నెల 4వ తేదీన పచౌరి తన దంతాలు నొప్పిగా ఉన్నాయని డాక్టర్ సునీల్ వద్దకు చికిత్స కోసం అతని ఇంటికి వచ్చాడు. దీంతో అదే అదనుగా భావించిన డాక్టర్ సునీల్ పచౌరికి తెలియకుండా ఇంజెక్షన్ చేస్తున్నానని చెప్పి మత్తు ఇంజెక్షన్ ఇచ్చాడు. దీంతో మత్తులోకి వెళ్లిపోయిన పచౌరిని డాక్టర్ సునీల్ హత్య చేశాడు. ముందుగా పచౌరి తలను మొండెం నుంచి తప్పించిన సునీల్ ఆ తరువాత అతని దేహాన్ని 12 ముక్కలుగా సర్జికల్ నైఫ్‌తో నరికాడు. అనంతరం అతని దుస్తులను సిటీకి అవతల పారేసి వచ్చాడు. అలా ఆ రోజు రాత్రి 1 గంట వరకు ఈ తంతు కొనసాగింది.
మరుసటి రోజు మంగళవారం.. అంటే ఈ నెల 5వ తేదీన మధ్యాహ్నం ముక్కలు చేయబడిన పచౌరి మృతదేహాన్ని డాక్టర్ సునీల్ యాసిడ్‌లో కరిగించడం మొదలు పెట్టాడు. అందుకు గాను కొద్ది రోజుల ముందే ఒక డ్రమ్ము యాసిడ్‌ను డాక్టర్ సునీల్ తెప్పించి తన ఇంట్లో పెట్టించుకున్నాడు. అయితే డాక్టర్ సునీల్ ఇంట్లో ఏదో జరుగుతుందని ఇరుగు పొరుగు వారు సమాచారం ఇవ్వగా రంగంలోకి దిగిన పోలీసులు నేరుగా సునీల్ ఇంటికి వచ్చారు. అక్కడ రక్తంతో తడిసి ఉన్న సునీల్‌ను పోలీసులు చూసి వెంటనే అతన్ని వారు అదుపులోకి తీసుకున్నారు. అలాగే పచౌరి మృతదేహం ముక్కలను వారు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా డాక్టర్ సునీల్ ఆ సిటీలోని లీడింగ్ ఆర్థోపెడిక్ డాక్టర్లలో ఒకడని తెలిసింది. అతను ఇటార్సిలో ఉన్న ప్రభుత్వ హాస్పిటల్‌లో మెడికల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నాడని కూడా పోలీసులు తెలుసుకున్నారు. ఈ క్రమంలో వారు కేసు విచారణ చేస్తున్నారు.