తిరుపతిలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. పెద్దిరెడ్డి ఇంటి గేటును అక్రమంగా ఏర్పాటు చేశారని జనసేన నేత కిరణ్ రాయల్ ఆందోళనకు దిగారు. మున్సిపల్ అధికారులు వెంటనే గేటును తొలిగించకపోతే తాము బద్దలు కొడతామని ఆయన హెచ్చరించారు. ‘వాస్తు రూపం కావాలని బుగ్గమట్టం భూముల్లో నాలుగేళ్ల క్రితం ప్రభుత్వ నిధులు రూ. 90 లక్షలు ఖర్చు పెట్టి రోడ్డు నిర్మించారని ఆరోపించారు.
18, 19 వార్డులకు ఆ రోడ్డు లింకప్ అని చెప్పారు. ఆ రోడ్డుకు రెండు వైపులా గేట్లు పెట్టడం వల్ల ఆస్పత్రులు, కాలేజీలు, స్కూళ్లకు వెళ్లే ప్రజలు ఇబ్బందులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఆ గేటు తీయించాలని ఎన్నికల సమయంలో ప్రజలు అడిగితే తాము హామీ ఇచ్చామన్నారు. ప్రజల రవాణా సౌకర్యం కోసం పెద్దిరెడ్డి అక్రమంగా నిర్మించిన గేట్లను తొలగించాలని డిమాండ్ చేశారు. 48 గంటల్లో గేటు సమస్యకు పరిష్కారం చూపిస్తామని మున్సిపల్ అధికారులు తెలిపారని.. అలా చేయకపోతే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. అవసరమైతే ఆ గేటును తామే బద్దలు కొడతామని కిరణ్ రాయల్ వార్నింగ్ ఇచ్చారు.