కరోనా నేపథ్యంలో ప్రస్తుతం మనం రక రకాల మాస్కులను ఉపయోగిస్తున్నాం. వైద్య నిపుణులు, సైంటిస్టులు కూడా బహిరంగ ప్రదేశాల్లో తిరిగినప్పుడు సోషల్ డిస్టన్స్‌ను పాటించడంతోపాటు మాస్కులను ధరించాలని అంటున్నారు. దీని వల్ల కోవిడ్ సోకకుండా ఉంటుంది. అయితే ఎక్కువ సేపు ఫేస్ మాస్క్‌ను ధరించడం వల్ల కార్బన్ డయాక్సైడ్‌ను ఎక్కువగా పీల్చాల్సి వస్తుందని, శ్వాస సరిగ్గా ఆడదని కొందరిలో అపోహలు ఉన్నాయి. వీటిలో అసలు ఎంతమాత్రం నిజం లేదని సైంటిస్టులు తెలిపారు.
ఫేస్ మాస్క్‌లను ఎక్కువ సేపు ధరిస్తే కార్బన్ డయాక్సైడ్‌ను ఎక్కువగా పీల్చాల్సి ఉంటుందన్న విషయంలో నిజం లేదని సైంటిస్టులు తమ రీసెర్చి ద్వారా వెల్లడించారు. అలాగే ఎక్కువ సేపు మాస్కు ధరిస్తే శ్వాస ఆడదన్న విషయంలోనూ నిజం లేదని అన్నారు. ఈ మేరకు వారు తమ అధ్యయన వివరాలను అమెరికన్ థోరాకిక్ సొసైటీ అనే జర్నల్‌లో ప్రచురించారు.
మనం సాధారణంగా మాస్క్ ధరించి లేనప్పుడు ఎక్కువ మొత్తంలో గాలి పీలుస్తాం. కానీ మాస్క్ ధరిస్తే తక్కువ మొత్తంలో గాలి లోపలికి వెళ్తుంది. అంతే. కానీ.. శ్వాస ఆడదన్న విషయం అవాస్తవమని సైంటిస్టులు తెలిపారు. తక్కువ మొత్తంలో గాలి పీలుస్తాం కనుక కొందరికి శ్వాస ఆడనట్లు అనిపిస్తుందని, అంత మాత్రం చేత అసలు శ్వాస ఆడడం లేదని అనుకోకూడదని అన్నారు. ఈ విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. అలాగే ఎక్కువ సేపు మాస్క్‌ను ధరిస్తే కొందరికి శ్వాస ఆడనట్లు అనిపిస్తుందని, తాము వదిలే కార్బన్ డయాక్సైడ్‌నే ఎక్కువగా పీలుస్తామనే భావన కలుగుతుందని, కానీ ఇందులోనూ నిజం లేదని తెలిపారు. కనుక ఎవరైనా సరే మాస్క్‌ను ఎంత సేపైనా ధరించవచ్చన్నారు. కాకపోతే బహిరంగ ప్రదేశాల్లో లేనప్పుడు లేదా ఇతరులకు చాలా దూరంగా ఉన్నప్పుడు మాస్క్‌లను కొంత సేపు తీస్తే ఎలాంటి ప్రమాదం ఉండదని తెలిపారు.