మనం ఏదైనా పెళ్లి వేడుకకి వెళ్తే ముందుగా చూసేది వధూవరులను. వధూవరులు ఎలా ఉన్నారు? ఎంతందంగా ఉన్నారు? జోడీ కుదిరిందా..? ఇలా రకరకాలుగా వారి గురించి మాట్లాడుకుంటుంటాం. ఒకవేళ ఆ పెళ్లి వేడుకలో వధూవరులు లేకపోతే. పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె లేకుండా వివాహం ఎలా జరుగుతుంది అంటారా..? జరుగుతుంది.. దాన్నే ప్రేత కళ్యాణం అంటారు. అదేంటీ.. గాంధర్వ కళ్యాణం గురించి విన్నాం కానీ ప్రేత కళ్యాణం ఏంటని అనుకుంటున్నారా..? తెలుసుకోవాలంటే ఓ సారి ఈ స్టోరీ చదివేయండి..
కర్ణాటకలోని మంగళూరులో ఓ పెళ్లి వేడుకకు వెళ్లిన ఓ వ్యక్తి తాను చూసిన వింత వివాహం గురించి సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశాడు. దాని గురించి అతడు ఏం చెప్పాడంటే..?
‘తాజాగా నేనొక వివాహానికి హాజరయ్యాను. మనం చూసే పెళ్లిళ్ల మాదిరిగానే ఉంటే.. ఇలా నేను మీ ముందుకొచ్చి మాట్లాడేది ఏమి ఉండేది కాదు. ఇక్కడ పెళ్లి కుమారుడు, కుమార్తె 30 ఏళ్ల క్రితమే మరణించారు. ఇప్పుడు వారి వివాహం జరిగింది. దక్షిణ కన్నడ సంప్రదాయం తెలియని వారికి నేను చెప్పే విషయం వింతగానే ఉంటుంది. కానీ ఇది వాస్తవం.
ప్రసవ సమయంలో మరణించి ఓ బిడ్డకు.. అదే మాదిరిగా ప్రసవ సమయంలోనే మరణించిన మరో బిడ్డతో ఈ సంప్రదాయం ప్రకారం వివాహం జరిపిస్తారు. మొదట రెండు కుటుంబాలు కలుసుకొని ఎంగేజ్‌మెంట్ చేస్తారు. మిగిలిన పెళ్లిళ్లమాదిరిగానే వివాహ తంతు అంతా పూర్తి చేస్తారు. మొదట అబ్బాయి తెచ్చిన చీరను వధువు ధరించాలి. ఆమె సిద్ధం కావడానికి కొంత సమయం కూడా ఇచ్చారు. పెళ్లిపీటల మీద కూర్చునే ముందు వారిద్దరూ కలిసి ఏడడుగులు నడిచారు. తాళికట్టడం, ఆశీస్సులు తీసుకోవడం, చదివింపులు, అత్తింటికి వెళ్లడం.. ఇలా అన్నీ సాగాయి.
ఇలా మరణించిన ఆత్మలకు పెళ్లి చేయడం సులభమేనని భావించకండి. సంబంధం కుదుర్చుకునే ముందు అన్ని వివరాలు పరిశీలిస్తారు. పెళ్లి కుమార్తె వయస్సు ఎక్కువని వరుడు కుటుంబం ముందుగా ఓ సంబంధాన్ని తిరస్కరించింది తెలుసా..! ఏది ఏమైనప్పటికీ.. ఈ సంప్రదాయాలన్నీ చాలా అందంగా ఉంటాయి. తమ బిడ్డలు మరణాంతరం కూడా సుఖంగా ఉండాలని ఘనంగా వేడుక చేసిన పెద్దలు.. వచ్చిన అతిథులకు రుచికరమైన వంటలు కూడా వడ్డించారు’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.