ఏపీలో కూటమి ప్రభుత్వ ఎన్టీఆర్ భరోసా పేరుతో పింఛన్లు అందజేస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా పింఛన్ దారులకు ఇవ్వాల్సిన సొమ్ము తీసుకుని సంక్షేమ కార్యదర్శి (వెల్ఫేర్ అసిస్టెంట్) పరారయ్యాడు. ఈ ఘటన ఎన్టీఆర్ జిల్లాలోని కంచికచర్లలో చోటుచేసుకుంది. కంచికచర్ల పట్టణానికి చెందిన సంక్షేమ కార్యదర్శి తోట తరుణ్ కుమార్ పింఛన్‌దారులకు ఇవ్వాల్సిన సుమారు రూ. 7.55 లక్షలతో పారిపోయినట్లు మండల పరిషత్ అభివృద్ధి అధికారిణి (ఎంపీడీవో) లక్ష్మీ కుమారి వెల్లడించారు.
ఇదీ జరిగింది
గంపలగూడెం మండలం పెనుగోలనుకు చెందిన తోట తరుణ్ కుమార్ అనే వ్యక్తి కంచికచర్లలో గత 6 నెలలుగా సంక్షేమ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే తాజాగా పింఛన్‌దారులకు ఇవ్వాల్సిన నగదును కార్యాలయం నుంచి తీసుకెళ్లాడు. మంగళవారం ఉదయం పింఛన్ ఇవ్వడానికి అతడు రాకపోవడంతో ఎంపీడీవోకు అనుమానం వచ్చింది. వెంటనే అతడికి కాల్ చేయగా స్పందించలేదు. తరుణ్‌కుమార్ స్వగ్రామం పెనుగోలనులో ఉన్న ఇంటికి ఫోన్ చేసినా స్పందన రాలేదు. దీంతో అతడు పింఛను నగదు తీసుకుని పరారైనట్లు భావించిన ఎంపీడీవో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఎంపీడీవో తెలిపారు. తరుణ్ కుమార్‌పై శాఖాపరమైన చర్యలకు ఉన్నతాధికారులకు సిఫార్సు చేస్తామని ఎంపీడీవో వెల్లడించారు.