దేశవ్యాప్తంగా ఉన్న జాతీయ రహదారులతోపాటు ఇతర రహదారులపై కూడా టోల్ ప్లాజాల వద్ద ఫాస్టాగ్ సౌకర్యం అందుబాటులో ఉన్న విషయం విదితమే. కేంద్ర ప్రభుత్వం దీన్ని ఎప్పుడో అందుబాటులోకి తెచ్చింది. ఎన్‌హెచ్ఏఐ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీని వల్ల వాహనదారులు టోల్ ప్లాజాల వద్ద ఆగకుండా నేరుగా వెళ్లిపోవచ్చు. వారి ఫాస్టాగ్ అకౌంట్ నుంచి డబ్బులు ఆటోమేటిక్‌గా కట్ అవుతాయి. అందుకు గాను వాహనంపై ఉండే ఫాస్టాగ్ స్టిక్కర్‌ను టోల్‌ప్లాజా సిబ్బంది స్కాన్ చేస్తారు. దీంతో ట్రాన్సాక్షన్ ఆటోమేటిగ్గా పూర్తవుతుంది. ఇక ఫాస్టాగ్ విధానం వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.
* టోల్ ప్లాజాల వద్ద నగదు చెల్లించాల్సిన పని ఉండదు. ప్రక్రియ అంతా ఆన్‌లైన్‌లోనే జరుగుతుంది. కనుక నగదు తీసుకువెళ్లడం, చిల్లర లేదని ఇబ్బంది పడడం ఉండదు.
* ఫాస్టాగ్‌ల వల్ల టోల్ ప్లాజాల వద్ద వాహనదారులు ఎక్కువ సేపు వేచి చూడాల్సిన పనిలేదు. టోల్ ప్లాజా వద్దకు వాహనం వచ్చి వెళ్లే లోపే దానిపై ఉండే ట్యాగ్‌ను అక్కడి సిబ్బంది రీడ్ చేస్తారు. దీంతో ఫాస్టాగ్ అకౌంట్‌లో ఉండే డబ్బులోంచి టోల్ మొత్తం ఆటోమేటిగ్గా కట్ అవుతుంది. దీని వల్ల టోల్ ప్లాజాల వద్ద ఆగాల్సిన పనిలేకుండా నేరుగా వెళ్లవచ్చు. ఎంతో సమయం, ఇంధనం ఆదా అవుతాయి.
* ఫాస్టాగ్ అకౌంట్‌ను వినియోగదారులు సులభంగా రీచార్జి చేసుకోవచ్చు. అందుకు క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెఫ్ట్, ఆర్‌టీజీఎస్, నెట్ బ్యాంకింగ్ వంటి మెథడ్స్‌ను ఉపయోగించవచ్చు.
* ఫాస్టాగ్ అకౌంట్ కలిగి ఉన్న వ్యక్తి మొబైల్ నంబర్‌కు ఎప్పటికప్పుడు ఎస్ఎంఎస్ అలర్ట్స్ వస్తాయి. రీచార్జి చేసినా, టోల్ చార్జి కట్ అయినా, తక్కువ బ్యాలెన్స్ ఉన్నా ఎప్పటికప్పుడు ఎస్ఎంఎస్ అలర్ట్స్ పంపిస్తారు.
* ఫాస్టాగ్ విధానానికి గాను ఆన్‌లైన్ పోర్టల్స్ ఉంటాయి. వాటి ద్వారా వినియోగదారులు తమ ఫాస్టాగ్ అకౌంట్లను సులభంగా మేనేజ్ చేసుకోవచ్చు.
* ఒక్కసారి ఫాస్టాగ్ తీసుకుంటే 5 ఏళ్ల వరకు పనిచేస్తుంది.
* టోల్ ప్లాజాల వద్ద టోల్ కట్టినందుకు రశీదులు ఇవ్వడం తప్పుతుంది. దీంతో పేపర్ వినియోగం తగ్గి పర్యావరణాన్ని రక్షించినవారమవుతాం.
ఫాస్టాగ్ తీసుకునేందుకు వాహనదారులు ఆన్‌లైన్‌లో ఆ సర్వీస్‌ను అందిస్తున్న ఏదైనా బ్యాంకులో అప్లై చేయవచ్చు. సదరు బ్యాంక్‌కు చెందిన ఫాస్టాగ్ పోర్టల్‌లో అకౌంట్ క్రియేట్ అవుతుంది. అందులో ఎప్పటికప్పుడు నగదు రీచార్జి చేసుకోవాలి. ఫాస్టాగ్‌కు దరఖాస్తు చేశాక వాహనానికి అతికించే స్టిక్కర్ వచ్చేందుకు కొద్ది రోజుల సమయం పడుతుంది. బ్యాంకులను బట్టి 7 రోజుల వరకు అందుకు సమయం పడుతుంది. స్టిక్కర్ వచ్చాక దాన్ని వాహనం ముందు భాగంలో అద్దంపై లేదా సైడ్ మిర్రర్‌పై టోల్ ప్లాజా వద్ద స్కానింగ్ కు అనువుగా ఉండేలా అతికించి, ఫాస్టాగ్‌ను వాడుకోవచ్చు.