క్యూన్యూస్కు చెందిన తీన్మార్ మల్లన్న ( Teenmar Mallanna ) చుట్టూ ఉచ్చు బిగుస్తున్నది. క్యూ న్యూస్ టీమ్ నుంచి బయటికి వచ్చి చిలుక ప్రవీణ్ మల్లన్నపై సంచలన ఆరోపణలు చేశారు. ప్రవీణ్ కు కౌంటర్ ఇచ్చే క్రమంలో మల్లన్న ప్రవీణ్ అమ్మయిలతో ఉన్న ఫోటోలను చూపించారు. అయితే ఆ ఫోటోల్లో ఉన్న ఓ మహిళ తాను ప్రవీణ్కి మిత్రురాలినని, తన వ్యక్తిగత జీవితానికి మల్లన్న భంగం కలిగించాడని ఆ యువతి పోలీసులను ఆశ్రయించింది. ఆ యువతి ఫిర్యాదు మేరకు క్యూన్యూస్ ఆఫీస్లో సోదాలు నిర్వహించిన పోలీసులు సీఆర్పీసీ కింది నోటీసులు జారీ చేశారు. ఆయన వివరణ తీసుకున్న తర్వాత అరెస్టుపై నిర్ణయం తీసుకుంటామని పోలీసులు తెలిపారు. అసలు తీన్మార్ మల్లన్నపై ఏ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఒకవేళ రుజువైతే ఎంత మేరకు శిక్ష పడుతుంది?
తీన్మార్ మల్లన్నపై ఐటీ యాక్ట్ 67తోపాటు ఐపీసీ 506, 507, 417 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
ఐటీ యాక్ట్ 67.. ఎలక్ట్రానిక్ మాధ్యమాల్లో అసభ్యకరమైన విషయాలను ప్రచురించినందుకు లేదా ప్రసారం చేసినందుకు శిక్ష గురించి తెలుపుతుంది. ఈ నేరానికి మొదటిసారి పాల్పడితే మూడేండ్ల జైలు శిక్షతోపాటు రూ.5లక్షల వరకు జరిమానా విధించవచ్చు. రెండోసారి పాల్పడితే ఐదేండ్ల జైలుశిక్షతో పాటు రూ.10లక్షల వరకు జరిమానా విధించవచ్చు.
ఐపీసీ 506, 507.. బెదిరింపులకు పాల్పడినందుకు శిక్ష గురించి వివరిస్తుంది. ఈ నేరానికి పాల్పడినట్లు రుజువైతే రెండేండ్ల వరకు జైలు శిక్ష విధించవచ్చు.
ఐపీసీ 417.. చీటింగ్ పాల్పడినందుకు శిక్ష. చీటింగ్ నేరానికి పాల్పడినట్టు రుజువైతే గరిష్ఠంగా ఏడాది వరకు జైలుశిక్షతోపాటు జరిమానా విధించవచ్చు.