చాలామంది ఈ రోజుల్లో డయాబెటిస్ తో బాధపడుతున్నారు. డయాబెటిస్ ఉన్నట్లయితే కచ్చితంగా మందుల్ని వాడాలి. లేదంటే షుగర్ కంట్రోల్ అవ్వదు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ప్రకారం భారతదేశంలో ఏకంగా 101 మిలియన్ మంది డయాబెటిస్ కారణంగా బాధపడుతున్నారు. చాలామంది దీర్ఘకాలిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. అయితే బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉండడానికి రెగ్యులర్ గా చెక్ అప్ చేయించుకోవడంతో పాటుగా డైట్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం, ఫిజికల్ యాక్టివిటీ ఇలా ప్రతి దానిపై దృష్టి పెట్టాలి, లేదంటే చాలా సమస్యలు వస్తాయి.
నిజానికి డయాబెటిస్ ని కంట్రోల్ చేయడం కష్టం. కానీ ప్రారంభ దశలో ఉన్నప్పుడు జీవనశైలిలో మార్పు, బరువు తగ్గడం, సంరక్షణ, డాక్టర్ల సూచించిన మందులు వేసుకోవడం వంటివి చేయడం వలన మధుమేహాన్ని కంట్రోల్ చేయవచ్చు. రోగుల ఆరోగ్యం బాగుంటుంది. అయితే సడన్ గా డయాబెటిస్ ఉన్నవాళ్లు మందుల్ని మానేయడం వలన ఇన్ఫెక్షన్లు పెరిగే ప్రమాదం ఉంటుంది. కీటోయాసిడోసిస్ వంటి తీవ్రమైన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఇది రక్తంలో ఆమ్లాలు పేరుకుపోవడం వలన కలిగే ప్రాణాంతక పరిస్థితి. తక్షణమే చికిత్స చేయకపోతే కోమాలోకి వెళ్లే పరిస్థితి కూడా కలుగుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఈ మధుమేహం అనేది గమ్మత్తయినది. మధుమేహ వ్యాధిగ్రస్తులు ఔషధాలని ఆపడం వలన గ్లైసిమిక్ వైవిధ్యానికి దారితీస్తుంది. అంధత్వం, మూత్రపిండాల వైఫల్యం వంటి ప్రమాదాలు కలగవచ్చు. కండరాల సమస్యలు, బరువు తగ్గడం, అలసట వంటివి మందుల్ని ఆపేయడం వలన కలిగే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మందుల్ని మానేయడం వలన హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదం కూడా ఉందట. కాబట్టి వైద్యుల సలహా తీసుకోకుండా ఏమి చేయకండి. అనవసరంగా ప్రాణాన్ని రిస్క్ లో పెట్టుకోకండి.