సాధారణంగా చాలా మందికి భోజనం చివరిలో పెరుగు తినకపోతే ఏదో వెలితిగా ఫీల్ అవుతారు. ముఖ్యంగా శరీరానికి కావల్సిన పోషకాలు పెరుగులో పుష్కలంగా ఉంటాయి. పలు అనారోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి. పెరుగు వలన జీర్ణవ్యవస్థ చక్కగా పనిచేస్తుంది. ఇందులో ఉండే మంచి బ్యాక్టీరియా జీర్ణశయానికి, పేగులకు ఎంతగానో మేలు చేస్తుంది. క్యాన్సర్లను అడ్డుకునే శక్తి పెరుగులోని ఔషధ గుణాలకు ఉందని సైంటిస్టులు చేపట్టిన పరిశోధనల్లో వెల్లడైంది. పెరుగు ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ రాత్రిపూట పెరుగు తినొచ్చా… తినకూడదా? అనే సందేహం చాలా మందికి ఇంకా ఉంది. కొంతమంది తినొచ్చు అంటారు… ఇంకొంతమంది రాత్రిపూట పెరుగు అస్సలు తినకూడదు అంటారు.
అయితే రాత్రిపూట పెరుగు తినడం మంచిది కాదని, ఇక నుంచి తినడం మనేయాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే పెరుగు వల్ల దేహంలో కఫం పెరిగిపోతుందట. దీని ద్వారా జలుబు, దగ్గు ఉన్న వాళ్లకు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని పేర్కొంటున్నారు. కానీ ఇలాంటి సమస్యలు లేనివారు రాత్రి పూట కూడా పెరుగు నిరభ్యంతరంగా తినవచ్చు. కాగా, పాలలో ఉండే ప్రోటీన్స్ కంటె పెరుగులో ఉండే ప్రోటీన్స్ వల్ల ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది. మరియు రోజుకో గ్లాసు పాలు, కప్పు పెరుగు తింటే మనకు కావాల్సిన ప్రొటీన్ మొత్తం అందుతుంది.