హుజురాబాద్ వేదికగా టిఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. హుజురాబాద్ లో ఆదిపత్యం కోసం ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. బిజెపి తరఫున పోటీ చేస్తున్న మాజీ మంత్రి ఈటల రాజేందర్ ( Etela Rajender ), టిఆర్ఎస్ విమర్శలకు ఎప్పటికప్పుడు కౌంటర్‌లు ఇస్తున్నారు. తాజాగా కూడా హుజూరాబాద్‌లో టీఆర్ఎస్ అక్రమ సంపాదనతో గెలవాలని చూస్తుందని ఫైర్ అయ్యారు.
అలాగే పథకాల పేరిట ప్రజలను మభ్యపెట్టే పని చేస్తున్నారని అన్నారు. ఇలా మాట్లాడుతున్న ఈటలకు, మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈటల మోడీ బొమ్మను, బీజేపీ జెండాను దాచి ప్రచారం చేస్తున్నారని, బీజేపీకి ఓటు వేస్తే పెట్రోల్ ధర రూ.200 దాటిస్తారన, ఈటల గెలిస్తే ఆయనకు మాత్రమే లాభమని, టీఆర్‌ఎస్‌ను గెలిపిస్తే హుజూరాబాద్ ప్రజలకు ప్రయోజనం ఉంటుందని అన్నారు.
ఇక మోదీతో కొట్లాడి ఈటల వెయ్యి కోట్ల ప్యాకేజీ తేగలడా అని ప్రశ్నించారు. అయితే రాజకీయంగా హరీష్ రావు ఏదో విమర్శలు చేయాలనే విధంగా చేస్తున్నారు తప్ప, ఆయన విమర్శల్లో ఏ మాత్రం లాజిక్ లేదని బిజెపి శ్రేణులు అంటున్నాయి. ఈటల రాజేందర్ బిజెపి జెండాతోనే ప్రచారం చేస్తున్నారని, హుజురాబాద్ ఈటల గెలిస్తే ఓటేస్తే, పెట్రోల్ రేటు ఎలా పెరుగుతుందని ప్రశ్నిస్తున్నారు. దేశవ్యాప్తంగా పెట్రోల్ రేట్లు పెరిగాయని, ఇందులో అటు కేంద్రం ఇటు రాష్ట్ర పన్నులు ఉన్నాయని చెప్తున్నారు.
అంతగా పెట్రోల్ రేటు తగ్గించాలనుకుంటే రాష్ట్రం విధించిన పన్నుని ఎందుకు తగ్గించడం లేదని అడుగుతున్నారు. ఇక ఈటల, మోదీని అడిగి నిధులు తీసుకురాగలరో లేదో భవిష్యత్తులో చూడొచ్చని, ఇప్పుడు ఈటల రాజీనామా చేయడంతోనే హుజురాబాద్‌కు, టిఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు ఖర్చు పెడుతుందని అంటున్నారు. ఏదేమైనా హరీష్ రావు ఏమాత్రం లాజిక్ లేకుండా మాట్లాడుతున్నారని కౌంటర్ ఇస్తున్నారు.