భార‌త్‌లో వాట్సాప్ సేవ‌లు నిలిచిపోనున్నాయా ?

-

భార‌త్ లో త్వ‌ర‌లో వాట్సాప్ సేవ‌లను నిలిపివేయ‌నున్నారా ? అంటే.. అందుకు అవున‌నే స‌మాధానం వినిపిస్తోంది. ఎందుకంటే ఈ మ‌ధ్య కాలంలో వాట్సాప్ లో న‌కిలీ వార్త‌ల జోరు ఎక్కువైంది. వాట్సాప్ ఎన్ని చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ప్ప‌టికీ న‌కిలీ వార్త‌ల వ్యాప్తిని అడ్డుకోలేక‌పోతోంది. ఈ క్ర‌మంలోనే వాట్సాప్ పై నిఘా పెట్టాల‌ని, అందుకు గాను అందులో ఉన్న ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్ష‌న్‌ను తీసేయాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం ఓ నూత‌న ప్ర‌తిపాద‌న‌ను వాట్సాప్ ఎదుట ఉంచాల‌ని అనుకుంటుంద‌ట‌. అయితే వాట్సాప్ అందుకు స‌సేమిరా అంటుంద‌ని స‌మాచారం. దీంతో వాట్సాప్ ఇక భార‌త్‌లో ప‌నిచేయ‌ద‌ని ప‌లువురు అభిప్రాయ ప‌డుతున్నారు.

ప్ర‌స్తుతం ప్ర‌పంచ వ్యాప్తంగా వాట్సాప్‌ను వాడుతున్న వారి సంఖ్య 1.5 బిలియ‌న్లు ఉండ‌గా, ఒక్క భార‌త్‌లోనే 200 మంది నెల‌వారీ యాక్టివ్ యూజ‌ర్లు వాట్సాప్‌కు ఉన్నారు. అయితే భార‌త్ లాంటి అతి పెద్ద క‌స్ట‌మ‌ర్ డేటాబేస్‌ను వాట్సాప్ వ‌దులుకుంటుందా ? అన్న‌దే ఇప్పుడు మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌. సాధార‌ణంగా వాట్సాప్‌లో ఉన్న ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్ష‌న్ వ‌ల్ల మెసేజ్‌ల‌ను పంపే వారు, అందుకునే వారు త‌ప్ప‌.. వాట్సాప్‌కు కూడా ఆ మెసేజ్‌ల‌ను చూసేందుకు అవ‌కాశం ఉండ‌దు. కానీ కేంద్ర ప్ర‌భుత్వం తీసుకురానున్న ప్ర‌తిపాద‌న ప్ర‌కారం.. వాట్సాప్‌లో ఉన్న ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్ష‌న్ ను తీసేయాల్సి ఉంటుంది. అయితే ఆ సెక్యూరిటీ ఫీచ‌ర్‌ను తీసేస్తే ఇక వాట్సాప్ ఎందుక‌ని ఆ సంస్థ హెడ్ ఆఫ్ క‌మ్యూనికేష‌న్స్ కార్ల్ వూగ్ ప్ర‌శ్నిస్తున్నారు.

కేంద్ర ప్ర‌భుత్వం ఒక వేళ త‌న ప్ర‌తిపాద‌న గ‌న‌క త‌మ ముందుకు తీసుకువ‌స్తే ఇక భార‌త్‌లో ఏ మాత్రం వాట్సాప్ కొన‌సాగే ప‌రిస్థితి ఉండ‌ద‌ని వూగ్ అంటున్నారు. కాగా రానున్న పార్ల‌మెంట్ ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఇప్ప‌టికే వాట్సాప్ దేశంలోని అన్ని రాజ‌కీయ పార్టీల‌కు వార్నింగ్ కూడా ఇచ్చింది. వాట్సాప్ ప్లాట్‌ఫాంలో బ‌ల్క్ మెసేజ్‌ల‌ను పంపే యూజ‌ర్ల‌పై చ‌ర్యలు తీసుకుంటామ‌ని, వాట్సాప్ యూజ‌ర్ల‌కు నాణ్య‌మైన సేవ‌ల‌ను అందిస్తూ, వారికి ప్రైవ‌సీ, సెక్యూరిటీని క‌ల్పించేందుకు క‌ట్టుబ‌డి ఉంద‌ని, అలాంటి ప్లాట్‌ఫాంను దుర్వినియోగం చేస్తే ఊరుకోమ‌ని వాట్సాప్ హెచ్చ‌రించింది. అయితే వాట్సాప్ భార‌త్‌లో కొన‌సాగుతుందా, లేదా అన్న‌ది మ‌రి కొన్ని రోజులు వేచి చూస్తే తెలుస్తుంది..!

Read more RELATED
Recommended to you

Exit mobile version