బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తెలంగాణ ప్రభుత్వం, సీఎం రేవంత్ మీద తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ పేరిట అంబేడ్కర్ అభయ హస్తమని చెప్పి రూ.12 లక్షలు ఇస్తామని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో చెప్పించారని గుర్తుచేశారు. సోమవారం అంబేడ్కర్ జయంతి సందర్భంగా తెలంగాణ భవన్‌లో కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. సీఎం రేవంత్ ఎస్సీ,ఎస్టీలకు రూ.12 లక్షలు ఇంకెప్పుడు ఇస్తావు అని అడిగారు.
‘ఎస్సీ,ఎస్టీ వాళ్లకు డబల్ బెడ్ రూమ్‌కు రూ.5 లక్షలు కాదు రూ.12 లక్షలు ఇస్తామని చెప్పారు. ఏమైంది మీ రూ.12 లక్షలు మాట.ఎస్సీ, ఎస్టీలకు 28 శాతం ప్రభుత్వ కాంట్రాక్టుల్లో వాటా కలిపిస్తామని చెప్పారు.ఇదెందుకు చేయలేదు రేవంత్ రెడ్డి. ఎస్సీ, ఎస్టీలకు విద్యాజ్యోతిల పథకం కింద 10వ తరగతి పాస్ అయితే రూ.10 వేలు, ఇంటర్ పాస్ అయితే రూ.15 వేలు, గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తే రూ.25 వేలు, పీజీ చేస్తే లక్ష, పీహెచ్డీలు చేస్తే రూ.5 లక్షలు ఇస్తామన్నారు.. ఇవన్నీ ఏమైందని నేను అడుగుతున్నాను’ అని కేటీఆర్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.