వికారాబాద్ జిల్లాలోని గడచర్లలో జరిగిన అధికారులపై దాడి గురించి మాజీ మంత్రి హరీశ్ రావు తాజాగా స్పందించారు. గురువారం ఉదయం చర్లపల్లి జైలుకు వెళ్లి మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని హరీష్ రావు కలిశారు.ఆయనతో ములాఖత్ అనంతరం హరీష్ రావు జైలు నుంచి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఎక్కడేం జరిగినా బీఆర్ఎస్ కుట్రే అని ప్రచారం చేస్తున్నారని ఆయన ఫైర్ అయ్యారు.
ఫార్మా సిటికీ లగచర్ల రైతులు భూములు ఇవ్వబోమని పోరాటం చేశారు. ప్రతిపక్ష నాయకుడిగా పట్నం నరేందర్ రెడ్డి రైతులకు మద్దతు ప్రకటించారు. నిందితుడిగా ఉన్న సురేశ్ ఒక్కసారే నరేందర్ రెడ్డికి ఫోన్ చేశారని రిమాండ్ రిపోర్ట్‌లో ఉందని హరీష్ రావు గుర్తుచేశారు. నరేందర్ రెడ్డిని కుట్రపూరితంగా అరెస్ట్ చేశారని ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ప్రతిపక్ష నేతలమైన తాము రైతుల వైపు ఉండాలా? సీఎం రేవంత్ రెడ్డికి భజన చేయాలా? అని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ ప్రజలకు చేసే సేవ ఇదేనా? అని నిలదీశారు.