జమిలి ఎన్నికలు నిర్వహణకు సంబంధించి కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. వచ్చే సారి వన్ నేషన్, వన్ ఎలక్షన్ నిర్వహించేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. వచ్చే శీతాకాల సమావేశంలో పార్లమెంటులో బిల్లు ప్రవేశ పెట్టేందుకు కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం నిర్ణయించింది.అందుకోసం 18 రాజ్యంగ సవరణలు చేయాల్సి ఉంటుందని న్యాయ నిపుణుల కమిటీ తేల్చింది.
ఇక జమిలి ఎన్నికలపై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్యానెల్ 62 పార్టీల అభిప్రాయాలను కోరగా 47 పార్టీలే స్పందించినట్లు సమాచారం. అందులో జమిలికి అనుకూలంగా 32 పార్టీలు, వ్యతిరేకంగా 15 పార్టీలు మాత్రమే స్పందించాయి. బీజేపీ, ఎన్పీపీ, అన్నాడీఎంకే , అప్నాదళ్, అసోం గణపరిషత్, బిజూ జనతాదళ్, శివసేన, శిరోమణి అకాళీదల్ తదితర పార్టీలు మద్దతివ్వగా.. కాంగ్రెస్, సమాజ్ వాదీ, బీఎస్పీ, సీపీఎం, ఆప్, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే వ్యతిరేకించాయి. టీడీపీ,వైసీపీ, బీఆర్ఎస్ పార్టీలు స్పందించలేదని తెలుస్తోంది.