కరోనా మహమ్మారి విషయంలో భారత ప్రభుత్వం మొదటి నుంచి అత్యంత వేగంగా, సమర్థవంతంగా పనిచేస్తూ వచ్చిందని డబ్ల్యూహెచ్ఓ అభినందించింది. మొదటినుంచి కరోనా పరీక్షలు, ఆసుపత్రుల సంఖ్య పెంచుతూ వచ్చిందని డబ్ల్యూహెచ్ఓ రీజినల్ డైరెక్టర్ పూనమ్ ఖేత్రపాల్ సింగ్ పేర్కొన్నారు. భారత్‌లో ఇప్పటికి ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాని ప్రాంతాలు చాలానే ఉన్నాయని, 130 కోట్లకు పైగా జనాభా కలిగిన దేశంలో ఇలాంటి పరిస్థితులు అసాధారణమని ఆమె అన్నారు.
భారత్‌తో పాటు అనేక దేశాల్లో మార్చిలో కేసుల పెరుగుదల మొదలైందని.. అయితే భారత్ మాత్రం కేసులు, మరణాల సంఖ్య పెరగకుండా కఠిన నిర్ణయాలు తీసుకుందని పూనమ్ ఖేత్రపాల్ సింగ్ పేర్కొన్నారు. ఇప్పుడు ఆ దేశాలతో పోల్చితే భారత్ చాకచక్యంగా వ్యవహరించిందనే చెప్పాలన్నారు. అలాగే భారత్‌తో పాటు ప్రపంచదేశాలన్ని భౌతిక దూరం పాటించడం, ప్రజల ఆరోగ్యంపై ఎక్కువగా దృష్టి సారించాలన్నారు.