తెలుగునాట ఉన్న వివిధ బ్రాహ్మణ శాఖలలో ద్రావిడ శాఖ దాని చరిత్రకు సంబంధించి ప్రస్తుతం అస్తవ్యస్తమైన కథనాలు కనబడుతున్నాయి. అసలు విషయం తెలియని కొత్తతరం కొంత పాత తరంతోపాటు ఈ అపఖ్యాతితోకూడిన కథనాలను నిజమని నమ్మే ప్రమాదం ఉంది. ఐతే శోచనీయం ఏమంటే పెద్దలైనవారే ఈ తప్పుడు చరిత్రను తెలియక ప్రచారం సాగించడంలో ముందున్నారు.
సరే విషయానికి వస్తే, చరిత్రపుటలనాధారం చేసుకుని తెలుగు బ్రాహ్మణుల చరిత్ర, వెలంగమాన్ అగ్రహారీకులకు సంబంధించి దొరికిన కొన్ని వ్యాసాలు, చరిత్ర అధారంగా, రాజరాజ నరేంద్రుని చరిత్ర, నన్నయభట్టారకుని మిత్రుడైన నారాయణభట్టుగారు మొదలైన అంశాలను పరిశీలించడం జరిగింది. ఆమేరకు లభించిన విషయాలని క్రోడీకరించి పంచే ప్రయత్నం ఇది.
రామాయణం ఎరిగిన వారు ఎవరూ ఈ వ్యాఖ్య చేయరు. పుత్ర మిత్ర కళత్రాదులతో సహా రావణుడు రాముడిచేతిలో మరణించాడు. మిగిలింది విభీషణుడు అతని మంత్రులు, కుటుంబం ఒక్కటే. ఒకవేళ అలా అనుక్కున్నా విభీషణుడి వంశం అని అన్నా కాస్త గౌరవంగా ధార్మికుడి వంశం అని గొప్పగా చెప్పుకున్నారు అనుకునే అవకాశం ఉండేది. కానీ రావణుడి వంశస్థులం అని చెప్పుకోవడం దారుణమైన స్థితి. అసలు రావణుడి వంశం మిగలనే లేదు. కాబట్టి రావణుడి వారసులం అనే ప్రసక్తే లేదు.
భారతీయులను విడగొట్టి పాలించడం కోసం బ్రిటీషువారు పుట్టించి తీసుకువచ్చిన ఆర్య ద్రావిడ కాన్సెప్టుతో పాటు అప్పట్లో వారు లేవనెత్తిన శైవ వైష్ణవ మతాల గొడవలకి కలిపి ఈ సిద్ధాంతాన్ని కొందరు దక్షిణాత్యులకు ఔతరాహికులకు ఆపాదించి రుద్దడంలో మ్లేచ్ఛులు విజయం సాధించారు. దాని పర్యవసానంగా ద్రావిడులు (కేవలం తెలుగు ద్రావిడ బ్రాహ్మణులే కాదు దాక్షిణాత్యులందరినీ ద్రావిడులని పిలిచారు) అంటే దాక్షిణాత్యులు శ్రీలంకతో కలిపి ద్రావిడులనీ వారికి అధిపతి రావణుడనీ కొత్త సిద్ధాంతాలు చేసారు.
సాధారణంగా ఇటువేపు వారు అప్పట్లో శైవ మతానుయాయులెక్కువ కాబట్టి వాళ్లందరూ రావణ బ్రహ్మ వంశీకులని ఆపాదించుకున్నారు. దీనికి రావణుడు అనే ఋషి కూర్చిన మహన్యాసం (ఇప్పటికీ సింహభాగం ఆ రావణుడు రాముని చేత నిహతుడైన దశకంఠుడే అని నమ్ముతారు, ఒక వేళ నిజమైనా కాకున్నా మనకి అప్రస్తుతం) తో పాటు రావణుని శివభక్తితత్పరతను తోడు తెచ్చుకుని ద్రావిడులందరూ ప్రత్యేకంగా రావణవంశంవారు ముఖ్యంగా ద్రావిడ బ్రాహ్మణులు అని ఒక అపప్రదని గొప్పగా చెప్పుకోవడం జరుగుతోంది. అందులో నిజంలేదు.