అంతర్జాతీయ స్థాయిలో నెట్‌వర్క్.. దేశాలను ఒప్పించి పనిచేయించుకునే సామర్థ్యం.. నిపుణులైన వైద్యులు, సైంటిస్టులతో కూడిన సంస్థ.. అయినప్పటికీ కరోనా మహమ్మారికి ఇంకా వ్యాక్సిన్‌ను తయారు చేయలేకపోయారు. పైగా ప్రపంచంలోని దేశాలన్నీ కరోనా కట్టడికి ఎంతో దూరం ఆలోచించి అనేక ముందు జాగ్రత్త చర్యలను ఇప్పటికే తీసుకుంటున్నాయి. కరోనా మన జీవితాలపై ముందు ముందు చూపే పెను ప్రభావం గురించి కూడా మనకు ఇప్పటికే తెలుసు. అయినప్పటికీ ఆ సంస్థ మాత్రం మన కన్నా అడ్వాన్స్‌డ్‌గా ఆలోచించలేకపోతోంది. ఇప్పటికే మనం తీసుకుంటున్న చర్యలను మళ్లీ మళ్లీ మనకే రివర్స్‌లో చెబుతోంది.. అవును.. మీరు ఆలోచించిందే.. అదే.. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO).. ఆ సంస్థ ప్రస్తుతం వ్యవహరిస్తున్న వైఖరి ప్రపంచంలోని ప్రజలకు తీవ్ర అసహనాన్ని, అసంతృప్తిని, ఆగ్రహాన్ని తెప్పిస్తోంది.
సమాజానికి కరోనా లాంటి ఓ పెద్ద కష్టం వచ్చినప్పుడు అందులో ఉండే పాలకులతోపాటు, మేథావులు కలసి పనిచేసి ఆ కష్టం నుంచి మనల్ని బయట పడేయాలి. నిజానికి మన ప్రభుత్వాలు ఆ విషయంలో చాలా వరకు విజయవంతంగానే పనిచేస్తున్నాయి కూడా. ఎంతో ముందు చూపుతో ఆలోచిస్తూ.. ఓ వైపు ఆర్థిక వ్యవస్థకు పునరుజ్జీవం కలిగించేలా ఆంక్షలను సడలిస్తూ.. తిరిగి కార్యకలాపాలు ప్రారంభమయ్యేలా చూస్తూనే.. మరో వైపు కరోనా నుంచి ప్రజలను రక్షించడం కోసం నూతన వ్యూహాలను అమలు చేస్తున్నాయి. కానీ మేథావులుగా పిలవబడే.. ప్రపంచ ఆరోగ్య సంస్థ మాత్రం మీన మేషాలు లెక్కబెడుతూ.. మనం ఆల్రెడీ పాటిస్తున్న వ్యూహాలు, తీసుకుంటున్న చర్యల గురించి మనకే చెబుతోంది. జనాలకు చిర్రెత్తుకు రావడానికి ఈ ఒక్క కారణం చాలదా చెప్పండి.
ప్రపంచ ఆరోగ్య సంస్థ నిజానికి మొదట్నుంచీ కరోనా విషయంలో నిజాయితీగా వ్యవహరించలేదు. చైనాతో కుమ్మక్కైందన్న విషయాన్ని కాసేపు పక్కనబెడితే.. కరోనా తీవ్రతను అంచనా వేయడంలో.. ముందుగానే ప్రపంచాన్ని హెచ్చరించడంలో ఆ సంస్థ విఫలమైంది. మొదట కరోనా వైరస్ మనుషుల నుంచి మనుషులకు వ్యాపించదని ఆ సంస్థే చెప్పింది. తరువాత తూచ్.. అలా కాదు.. మనుషుల నుంచి మనుషులకు వ్యాపిస్తుందని మాట మార్చింది. ఇలా ఎప్పటికప్పుడు మాట మీద నిలకడలేకుండా ఇష్టారీతిన వ్యవహరిస్తూ ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రజల్లో తన క్రెడిబిలిటీని పోగొట్టుకుంది. అంత ఉన్నతమైన సంస్థ హుందాగా వ్యవహరించకుండా.. ప్రజలను మభ్య పెడుతూ.. వారి నుంచి ఏదో విషయాన్ని దాచే ధోరణిలో వ్యవహరిస్తుండడం.. జనాలకు తీవ్రమైన ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. కరోనా లాంటి పెద్ద కష్టం వచ్చినప్పుడు మనకన్నా ఎంతో ముందు చూపుతో ఆ సంస్థ ఆలోచించి జనాలకు మేలు కలిగేలా సూచనలు చేయాలి. కానీ మనం తీసుకుంటున్న చర్యలనే తిరిగి ఆ సంస్థ మనకు చెప్పడం.. నిజంగా హాస్యాస్పదం అనే చెప్పాలి.
కరోనా వైరస్ ఇప్పుడప్పుడే అంతం అవ్వదని.. అది ఎక్కువ రోజుల పాటు ఉంటుందని.. కనుక ప్రస్తుతం దాంతో మనం సహజీవనం చేయాల్సిందేనని.. ఇప్పటికే మనం అర్థం చేసుకున్నాం. అందుకనే ప్రభుత్వాలు ఆ దిశగా ఆంక్షలను కూడా సడలిస్తున్నాయి. అయితే ఇదే విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పుడు.. చావు కబురు చల్లగా చెప్పినట్లు.. చెప్పింది. కరోనా వైరస్ అంతం అవ్వదని.. దాంతో జాగ్రత్తగా ఉండాలని ఆ సంస్థ ప్రతినిధులు అంటున్నారు. ఇక వీరి వ్యాఖ్యలపై ఏమనాలో మీరే చెప్పండి.. ప్రజలకు తెలియని ఏదైనా కొత్త విషయం చెప్పాల్సింది పోయి.. ఇంత బాధ్యతారాహిత్యంగా ఆ సంస్థ వ్యాఖ్యలు చేయడం.. ఏమాత్రం పట్టనట్లుగా వ్యవహారశైలిని ప్రదర్శించడం.. నిజంగా గతంలో ఎన్నడూ చూడలేదు. ఈ తరహా వ్యాఖ్యలు, వ్యవహార శైలి చాలవా.. ఆ సంస్థ చైనాకు ఊడిగం చేస్తుందని చెప్పడానికి.. ముందు ముందు ప్రపంచ ఆరోగ్య సంస్థ తన తీరును మార్చుకోకపోతే.. ఆ సంస్థ ఉనికికే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంటుంది..!