గర్భిణీలు కరోనా వ్యాక్సిన్ ( Vacation for Pregnant Women ) వేయించుకోవాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడి చేసిన సంగతి తెలిసిందే. వ్యాక్సిన్ వేసుకునే ముందు గైనకాలజిస్టును సంప్రదించాలని కూడా తెలిపింది. వ్యాక్సిన్ వేసుకునే విషయంలో గర్భిణీలు ముందుండాలని, దానివల్ల తల్లి, బిడ్ద ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపింది. తాజాగా గర్భిణీలు వ్యాక్సిన్ ఎందుకు వేయించుకోవాలి? దానివల్ల కలిగే ప్రయోజనాలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఆరోగ్య శాఖ చెప్పిన దాని ప్రకారం లక్షణాలు కనిపించే గర్భిణీల్లో పిండంపై ప్రభావం పడే అవకాశం ఉందని, అందువల్ల వ్యాక్సిన్ తప్పనిసరిగా తీసుకోవడమే ఉత్తమం అని చెబుతున్నారు.
ఇతర అనారోగ్య పరిస్థితులు, ఊబకాయం ఉన్నవారు, ముఖ్యంగా వయస్సు 35కంటే ఎక్కువ ఉన్నవారిలో ఇబ్బందులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. రక్తం గడ్డ కట్టడం మొదలగు సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయన్న ఉద్దేశ్యంలో వ్యాక్సిన్ తప్పక అవసరం అని సూచిస్తున్నారు.
కరోనా సోకడం వల్ల నెలలు నిండక ముందే ప్రసవం అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే బిడ్డ బరువు 2.5కిలోల కంటే తక్కువగా ఉండవచ్చని హెచ్చరిస్తున్నారు.
కోవిడ్ వ్యాక్సిన్ చాలా సురక్షితం. టీకా తీసుకున్నాక 3రోజుల వరకు చిన్నపాటి జ్వరం, టీకా ప్రదేశంలో నొప్పి, బలహీనంగా మారడం సహజమేనని, 3రోజుల తర్వాత మళ్ళీ మామూలు అయిపోతుందని ఆరోగ్య శాఖ వెల్లడి చేసింది.
గర్భిణీ మహిళలు ఎప్పుడైనా వ్యాక్సిన్ వేయించుకోవచ్చని, ఎంత తొందరగా వేయించుకుంటే అంత మంచిదని, ఒకవేళ గర్భంతో ఉన్నప్పుడు కరోనా సోకితే, ప్రసవం తర్వాత వ్యాక్సిన్ వేయించుకోవాలని సలహా ఇస్తున్నారు.