వారిద్దరూ మాజీ డిప్యూటీ సీఎంలు.. ఇద్దరిదీ ఒకే సామాజికవర్గం. కానీ, ఒకరంటే మరొకరికి అస్సలు పడదు. నిత్యం ఆధిపత్యం కోసం పోటీపడుతుంటారు. కానీ, గులాబీ బాస్, ముఖ్యమంత్రి కేసీఆర్ ఒకరికి షాక్ ఇచ్చినప్పుడు మరొకరు సంబురపడ్డారు. ఇలా ఇద్దరూ కేసీఆర్ చేతిలో షాకులు తిన్నవారే..తాజాగా.. ఏం జరిగిందో తెలియదుగానీ.. ఇద్దరూ పూర్తిగా సైలెంట్ అయిపోయారు. మౌనదీక్ష పాటిస్తున్నారు. జనంలోనూ పెద్దగా తిరగడం లేదు. ఇంతకీ వారిద్దరు ఎవరని అనుకుంటున్నారా..? ఒకరు స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, మరొకరు ఎమ్మెల్సీ కడియం శ్రీహరి. ప్రస్తుతం కేసీఆర్ ఇచ్చిన ఊహించని షాకులతో ఇద్దరూ సైలెంట్ అయిపోయారనే టాక్ వినిపిస్తోంది.
తెలంగాన రాష్ట్రం వచ్చిన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యేగా తాటికొండ రాజయ్య గెలవగా, వరంగల్ ఎంపీగా కడియం గెలిచారు. తెలంగాణకు మొదటి ముఖ్యమంత్రి దళితుడేనని చెప్పిన కేసీఆర్.. రాజయ్యకు డిప్యూటీ సీఎం కట్టబెట్టారు. సుమారు ఆరునెలల తర్వాత ఏం జరిగిందో తెలియదుగానీ.. ఒక్కసారిగా రాజయ్యను డిప్యూటీ సీఎం పదవి నుంచి కేసీఆర్ తొలగించడం, ఆ వెంటనే ఎంపీగా ఉన్న కడియంతో రాజీనామా చేయించి, డిప్యూటీ సీఎం చేయడం చకచకా జరిగిపోయాయి.
తన పదవి పోవడానికి కడియమే కారణమని అప్పట్లో రాజయ్య తన అనుచరుల వద్ద వాపోయినట్లు వార్తలు వచ్చాయి. ఇక అప్పటి నుంచి రాజయ్య కేవలం ఎమ్మెల్యేగానే కొనసాగతున్నారు. ఇక 2018లో రెండో సారి అధికారంలోకి వచ్చిన తర్వాత కడియంతోపాటు రాజయ్యకు కూడా కేసీఆర్ షాకులిచ్చారు. డిప్యూటీ సీఎం పదవులను కొనసాగించలేదు. దీంతో కనీసం మంత్రివర్గంలోనైనా తనకు చోటు దక్కుతుందని ఎమ్మెల్సీ కడియం భావించారు. ఇదే సమయంలో స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కూడా మంత్రిపదవి ఆశించారు. కానీ.. వీరికి చోటుదక్కలేదు.
రెండో మంత్రివిస్తరణ తర్వాత రాజయ్య తన అసంతృప్తిని వెల్లగక్కి కలకలం రేపారు. ఆ తర్వాత మళ్లీ వెనక్కితగ్గారు. ఇక కడియం మాత్రం సైలెంట్‌గా ఉండిపోయారు. పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలకు దూరంగానే ఉంటుననారు. ఇదే సమయంలో బీజేపీలోకి వెళ్లేందుకు కడియం రెడీ అవుతున్నారనే టాక్ వినిపించింది. ముందుముందు వీరిద్దరి కదలికలు ఎలా ఉంటాయో చూడాలి మరి.